calender_icon.png 19 July, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిజంలో చరిత్రాత్మకమైన మార్పులు

19-07-2025 12:00:00 AM

సిద్దిపేటలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

సిద్దిపేట, జూలై 18(విజయక్రాంతి): ఆధునిక యుగంలో జర్నలిజం చరిత్రాత్మకమైన మార్పులు ఎదుర్కొంటోందని, సాంకేతిక పరిజ్ఞానం మీడియా రంగాన్ని వేగంగా మార్చుతున్నదని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని విపంచి కళావేదికలో జర్నలిస్టుల కోసం నిర్వహించిన రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.

సామాజిక ప్రభావం, వ్యక్తిగత అభిరుచుల ప్రకారం వార్తల రూపకల్పన జరగాలని సూచించారు. తెలుగు వార్తలు సాధారణ పాఠకుడికీ అర్థమయ్యే రీతిలో ఉండాలన్నారు. త్వరలోనే మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, ప్రతి రంగంలోనూ వ్యక్తులు సామాజిక అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశోధనాత్మకంగా వార్తలు తయారు చేయాలని, ప్రజల ఆవశ్యకతల్ని తీర్చేలా వాటిని ప్రజల ముందుంచాలని సూచించారు. ప్రస్తుత కాలంలో యువతను బెట్టింగ్, డ్రగ్స్ వలయాల నుంచి బయటకు తేవడానికి జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల మాదిరిగా సిద్దిపేటలో సుమారు 70కి పైగా ఫైనాన్స్ సంస్థలు వెలిశాయని గ్రామీణ ప్రాంత ప్రజలు అవసరాల నిమిత్తం ఇంటిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారని చెప్పారు ఇలాంటివి ఆర్థిక భారమైన అంశాలుగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు.

ఇంటి రుణాలపై తీసుకున్న అప్పులు చెల్లించలేక సంస్థల వేధింపులు, బాధితుల ఆత్మహత్యలు వంటి అంశాలపై లోతుగా పరిశీలించి, బాధితుల వాదనలతో కూడిన కథనాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శిక్షణా శిబిరంలో మొదటి రోజు మూడు ముఖ్య అంశాలపై సెషన్లు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం  2005 పై సీనియర్ జర్నలిస్టు, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, ‘వార్త కథనాలు  ప్రత్యేక కథనాలు‘ అంశంపై దిశా ఎడిటర్ మార్కండేయ, ‘భాషా తప్పులు  దిద్దుబాట్లు‘ అనే అంశంపై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్.వి. రామారావు లు శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర రావు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, సిద్దిపేట జిల్లా ప్రతినిధులు రంగాచారి, రాజిరెడ్డి, అరుణ్, అంజయ్య, జనార్దన్, పాండు, సంజీవ్, శ్రీనివాస్ గౌడ్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.