ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ నేతల వ్యాఖ్యల్లో డొల్లతనం
రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
కరీంనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే, కరీంనగర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా, డొల్లతనంగా ఉన్నాయని మున్నూరు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి విమర్శించారు.
శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు మారాలంటే విద్యే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం 2,400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కు కేటాయించి, అందులో 2,050 కోట్లు తక్షణమే విడుదల చేసిందని తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో పడ్డాయని, అర్హత - అనర్హత, నిధుల దుర్వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.
అందుకే రైతుబంధు తరహాలో విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేసే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కల్పించే చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేయడం వల్ల విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ, విదేశీ అవకాశాలు దెబ్బతింటున్నాయని గుర్తించిన ప్రభుత్వం, ఫీజు బకాయిలున్నా పరీక్షలు ముగిసిన వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.
ఎన్ టి ఏ వైఫల్యాలపై కేంద్రం సమాధానం చెప్పాలని, తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉందని, రాజకీయ ఉనికి కోసం విద్యార్థులను వాడుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుస్సేన్, నాయకులు ఏం డి తాజ్, వెన్నం రజిత రెడ్డి, మాదాసు శ్రీనివాస్, చింతల్ కిషన్, కూడలి శ్రీధర్, అబ్దుల్ రెహమాన్, అమీర్, కుంభాల రాజు కుమార్, సామ్రాట్, బొమ్మ రాతి సాయి, తదితరులు పాల్గొన్నారు.






