06-10-2025 12:00:00 AM
దొరికిన బంగారు గొలుసును పోలీసులకు అప్పగింత
మేడ్చల్, అక్టోబర్ 5(విజయ క్రాంతి): తమకు దొరికిన రెండున్నర తులాల బంగారు గొలుసును ఇద్దరు సోదరులు పోలీసులకు అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసర గడిలో నివాసముంటున్న కుంటాల నవీన్ కుమార్, కుంటాల అనిల్ కుమార్ సమీపంలో గండి మైసమ్మ వద్ద ఉన్న పిస్తా హౌస్ లో చాయ్ తాగేందుకు వెళ్లగా వారికి రెండున్నర తులాల బంగారు గొలుసు దొరికింది.
ఈ విషయాన్ని గుండ్ల పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారేపల్లి సుధాకర్ కు తెలియజేసారు. మారేపల్లి సుధాకర్, సోదరులు కుంటాల నవీన్ కుమార్, కుంటాల అనిల్ కుమార్ కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డికి బంగారు గొలుసును అందజేశారు. అనంతరం పోలీసులు గొలుసు పోగొట్టుకున్న వారిని పిలిపించి రెండున్నర తులాల బంగారు గొలుసును అందజేశారు. దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న వారిని పోలీసులు అభినందించారు.