13 May, 2026 | 2:13 AM

బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

13-05-2026 12:57 AM
  1. బైక్‌ను ఢీకొట్టి బోల్తాకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు
  2. ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
  3. మృతుల్లో తెలంగాణకు చెందిన తండ్రీ కొడుకులు 

జహీరాబాద్, మే 12: కర్ణాటక రాష్ట్రంలో బీదర్‌లో కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శంషాల్లాపూర్ సమీపంలో జరిగింది. మృతుల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు తండ్రీ కొడుకులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు (49), అతని కొడుకు అరుణ్ (22) బైక్‌పై బీదర్ ప్రాంతంలో గల కౌట గ్రామంలో శుభకార్యానికి వెళ్తున్నారు. బీదర్ వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు అతివేగంగా బైకును ఢీ కొట్టింది.

దీంతో బస్సు బోల్తా కొట్టింది. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులతో పాటు నర్సింలు, అరుణ్ అక్కడికక్కడే మరణించారు. బస్సులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు వ్యక్తుల వివరాలు తెలియరాలేదు.