ఆసుపత్రి పరిశుభ్రత రోగుల భద్రతకు కీలకం
నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్
పంజాగుట్ట, జూన్ 21 (విజయక్రాంతి): ఆసుపత్రి పరిశుభ్రత అనేది రోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిమ్స్ ప్రాంగణంలో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఆకులు, వ్యర్థాలు, చెత్త పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛ నిమ్స్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
ప్రాంగణంలోని ప్రధాన రహదారులు, ఆసుపత్రి భవనాల పరిసరాలు, ఉద్యానవనాలు,పార్కింగ్ ప్రాంతాలు, పాదచారుల మార్గాలు, రోగులు, వారి సహాయకులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో విస్తృతంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటిండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్, డాక్టర్ మార్త రమేశ్, సూపర్ వైజర్లు రాము, రవి, అంజిరెడ్డి, సాయి, లెనిల్, శాస్త్రి, శివ, నిఖిల్ తదితరులు పాల్గొని, శ్రమదానం చేశారు.






