రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
బీఆర్‌ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జి గౌండ్ల నాగేందర్
ముషీరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ఎన్నికల ముందు రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని బీఆర్‌ఎస్ గోషామహల్ ఇన్చార్జి గౌండ్ల నాగేందర్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ హైదరాబాద్ కంటెస్టడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తోకలసి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలను గుర్తు చేశారు.
రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ తప్పిందని, రైతులకు రూ.500 బోనస్, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. అలాగే హైడ్రా పేరుతో భవనాలు కూల్చివేస్తున్నారని, బీజేపీతో రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ తదితరులు గుడి, బడి మధ్య పేకాట క్లబ్కు అనుమతి ఇచ్చి నెలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ క్లబ్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా శంకర్ యాదవ్ 7 అంతస్తుల భవనం నిర్మించారని ఆరోపిస్తూ, సంబంధిత వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు శైలేష్, శివశంకర్, గణేష్, రామన్, రమేష్ గుప్తా, శ్రీనివాస్ యాదవ్, టింకు, శ్రీనివాస్, బాబు, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.






