03-08-2025 12:13:02 AM
12వ శతాబ్దంలో అష్టకోణాకృతిలో జైనులు ఈ ఆలయాన్ని నిర్మించారు. భక్తులను కట్టిపడేసే అద్భుత శిల్పకళా సంపద దీని సొంతం. ఏడాదిలో రెండుసార్లు నేరుగా స్వామివారి పాదాలను లేలేత సూర్యకిరణాలు తాకుతుంటాయి. పూర్తి నల్లరాతితో నిర్మితమైన ఈ ఏకశిలా ఆలయమే సంతాననారాయణుడిగా భక్తులు కొలిచే ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లోని శ్రీలక్ష్మీనారాయణుడు.
ఆదిలాబాద్, విజయక్రాంతి : పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఏకశిలా ఆలయం..అద్భుత కళాఖం డాలు.. ఆనాటి శిలా శాసనాలు..లేలేత సూర్యకిరణాలు ఆలయంలోని మూలవిరాట్టు పాదా లపై పడే విధంగా సాంకేతిక నిర్మాణం..ఇలా ఎన్నెన్నో ఈ ప్రాచీన ఆలయ చరిత్రకు అనవాళ్లుగా నిలుస్తున్నాయి. పల్లవులు, కాకతీయుల కాలంనాటి అపురూపమైన శిల్పసంపదకు చిహ్నంగా, గతించిన చరిత్రకు అవి సజీవసాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో వెలిసిన పురాతనమైన శ్రీలక్ష్మీ నారాయణస్వామి, సూర్యనారాయణస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో జైనులు నిర్మించారని చెబుతారు. ఆల యంలోనికి వెళ్లగానే నల్లరాతిపై చెక్కిన శిల్పకళ సంపద భక్తులను కట్టిపడేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకుంటే ఆధ్యాత్మికత ఉట్టిపడు తుంది.
సంతానం లేని వారు భక్తితో స్వామివారిని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుం దని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రంలోని లక్ష్మీనారాయణుడు ‘సంతాన నారాయణుడి’గా పేరుపొందాడు. ఏటా కార్తిక మాసంలో శుద్ధ అష్టమి నుంచి బహుళ సప్తమి వరకూ ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఈ వేడుకల్లో స్వామి ముందు ఉంచిన పూలదండలను ధరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహిమగల్ల దేవుడు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి సై తం స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటైన జైనథ్ శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంపై ప్రత్యేక కథనం..
ఆలయానికి చేరుకోవాలంటే..
అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలకేంద్రంలోని అతి ప్రాచీన ఆలయం శ్రీ లక్ష్మీ నారాయ ణ స్వామి దేవాలయం. దీన్నే సూర్యనారాయణస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి 44వ జాతీయ రహదారి పై 300 కిలోమీటర్ల ప్రయాణం చేసి జిల్లా కేం ద్రానికి చేరుకోవాలి. జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఆలయం జాతీయ రహదారికి ఆనుకునే ఉంటుంది.
ఆలయానికి ఘన చరిత్ర..
కోరి వచ్చిన భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతున్న ఈ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దాదాపు 800 ఏళ్ల క్రితం జైనులు నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. అప్పటి పల్లవ, కాకతీయ రాజుల వైభవం..శిల్ప కళ..ఇప్పటికీ ఆనాటి గొప్పతనాన్ని చాటిచెబుతోంది. రాష్ట్రంలోనే అతి పురాతన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఒకే నల్లరాతితో నిర్మితమైన ఈ ఆలయ అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.
ఆలయ ఆవరణలోని శిలాశాసనాలు గోడలపై చెక్కిన 20శ్లోకాలను బట్టి జైనథ్ శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం ఎంతటి ప్రాచీనమైందో తెలుస్తోంది. జైనుల సంప్రదాయం ప్రకారం ఆలయ నిర్మాణం జరగడంతో దీనికి జైనథ్ శ్రీలక్ష్మీనారాయణస్వామి అనే పేరు వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఏకశిలతో నిర్మితమైన మూలవిరాట్టు శ్రీలక్ష్మీనారాయణ స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంకా ఈ ఆలయంలో చెన్నకేశవస్వామి, గరుత్మంతుడు, పద్మనాభస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇవి నాటి జైనుల కాలం నాటి అద్భుత శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి.
బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు..
ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతాయి. లక్ష్మీసమేతంగా ఆ శ్రీమన్నారాయణుడు పంచవాహనుడై గ్రామ వీధుల్లో పెద్ద రథంపై ఊరేగుతారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇదిలా ఉంటే బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష్మీనారాయణ స్వామి ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ కార్తీక మాసంలోనే ఇక్కడ ఐదు రోజుల పాటు జాతర కూడా కొనసాగనుంది.
శిథిలావస్థకు చేరుతున్న కోనేరు, చిన్న గుడులు..
ఈ ప్రధాన శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయంతో పాటు మరికొన్ని గుడులు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయానికి ముం దు భాగంలో ఉన్న చిన్న చిన్న గుడులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు ఆలయ కోనేరు సైతం నిర్వహణ లేక పూర్తిగా చెత్తాచెదారాం నిండి దుర్గంధమయంగా మారుతోం ది. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ఆలయం ముందు ఉన్న కోనేరును పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.
స్వామివారి పాదాలను సూర్యకిరణాలు స్పృశించే అద్భుత దృశ్యం..
జైనథ్‌లోని శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రతీ సంవత్సరం కార్తీక, మాఘ మాసాల్లో వారం రోజుల పాటు ఉదయ భానుడి లేలేత కిరణాలు శ్రీలక్ష్మీనారాయణస్వామి పాదాలు తాకుతూ ఉంటాయి. సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించినప్పుడు విగ్రహం పసిడి వర్ణశోభితంగా దర్శనమిస్తోంది.
మనసుకు ప్రశాంతతను కల్పించే ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. స్వామివారిని తొలి సూర్యకిరణాలు తాకడంతో ఈ ఆలయాన్ని సూర్యనారాయణ స్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి తరహాలో ఏటా సూర్య కిరణాలు ఆలయంలోని స్వామివారి పాదాల్ని తాకడం ఈ ఆలయ ప్రత్యేకత.