11-01-2026 12:29:52 AM
రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా జిల్లాల పునర్విభజన
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): జిల్లాల పునర్విభజనను రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నిర్ణయించడంతో ఇప్పుడు మిగిలే వి ఎన్ని జిల్లాల్లోనని రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంటుం ది?... ఏ నియోజకవర్గంలోని మండలాలు ఏ జిల్లాల్లోకి చేరుతాయనే చర్చ సర్వత్రా జోరు గా జరుగుతోంది. ప్రజలు ఇబ్బంది పడకుండా భౌగోళిక విభజన ఉంటుందని రాష్ట్ర ప్రభు త్వం చెప్తున్నప్పటికీ ఇప్పుడు దాన్ని ఎలా చేస్తారనేది చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను ఎన్నింటికి కుదిస్తారు. మొత్తంగా ఎన్ని జిల్లాలు ఉంటాయనే దానిపై రకరకాల ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. మరోవైపు దీనికి క్రమంగా రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కావాలని జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోబోమని ప్రధానప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ హెచ్చరిస్తుంటే... ఏదేమై నా నాడు అశాస్త్రీయంగా చేసి న జిల్లాల విభజనను ఇప్పు డు శాస్త్రీయంగా చేసి తీరుతామని అధికార పక్షం అదేస్థాయిలో కౌంటరిస్తోంది.
తెలంగాణ రాష్ర్టం 2014 జూన్ 2న ఏర్పడిన నాటికి 10 జిల్లాలే ఉండేవి. అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ప్రభుత్వం వాటిని ఏకంగా 33 జిల్లాలుగా చేసింది. భొగోళికంగానే కాదు జనాభా పరంగా చూసినా ఏపీ కంటే చిన్నదిగా ఉన్న తెలంగాణను మూడు రెట్లు జిల్లాలు పెంచుకుని పోయిందని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతకాలం వరకు అసలు ఏ మండలం ఏ జిల్లాలో ఉందో తెలియక ప్రజలు తికమకపడ్డారు. కొన్ని నియోజకవర్గాలైతే రెండుమూడు జిల్లాల్లో కలిసిపోయాయి.
అప్పట్లోనే 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేయడం అవసరమా? అనే చర్చ జరిగింది. నాయకులు అడగడమే ఆలస్యం అన్నట్లుగా ఇష్టానుసారంగా జిల్లాలు చేశారనే విమర్శలు వచ్చాయి. పైగా జిల్లాల ఏర్పాటుకు ఒక శాస్త్రీయత కానీ ప్రామాణికత కానీ లేదని కూడా వాదనలు వినిపించాయి. ఇక పేరుకు జిల్లాలు అని ప్రకటించారు కానీ ఈ రోజుకీ అనేక చోట్ల భౌగోళికతోపాటు రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
తమ మండలాన్ని సమీప జిల్లాలో కలపాలనే విజ్ఞప్తులు కూడా ప్రజల్లోనుంచి వస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాల పునర్విభజన చేయాలని అంశం తెరమీదకు తెచ్చింది. శీతాకాల శాసనసభ సమావేశాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ప్రకటనతో జిల్లాల పునర్విభజన చర్చ మొదలైందనే చెప్పాలి. ఇందులో భాగంగానే అధికారులు కూడా కసరత్తును మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు అనుగుణంగానే మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
అసలు ఎన్ని జిల్లాలు?
తెలంగాణాలో జిల్లాల పునర్విభజనకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో 33 జిల్లాలను ఎన్ని జిల్లాలు చేస్తారు?. ఎన్ని జిల్లాలకు తగ్గిస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్రమైన నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుని ప్రజల అవసరాలు, పాలనా పరంగా అనువుగా ఉండేలా జిల్లాలను పునర్విభజన చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, మండలాలు రెవెన్యూ డివిజన్ల విషయంలో కూడా విభజన అన్నది ఒక విధానం లేకుండా చేశారని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో వాటిని సైతం సరిచేయాలని చూస్తోంది. పాత జిల్లాలకు 20 కిలోమీటర్లు ఉన్న కొన్ని గ్రామాలను 40 నుంచి 70 కి.మీ. ఉన్న కొత్త జిల్లాల్లో కలిపారు. దీంతో పనుల కోసం వెళ్లాలన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో నియోజకవర్గం రెండేసి, మూడేసి జిల్లాల్లో ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నారాయ ణపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉంది.
ఇక ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాం తాన్ని హైదరాబాద్ మహానగరాన్ని మూడు జిల్లాలుగా చేస్తారని, హన్మకొండ, వరంగల్‌ను కలుపుతారని, సిద్దిపేట జిల్లా, గద్వాలను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఆ జిల్లా ప్రజల్లోనూ ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దీనిని బీఆర్‌ఎస్ నేతలు, మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ లో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. దాంతో ఒక పార్లమెంట్‌కి ఒక జిల్లా వంతున 17 జిల్లాలుగా మారుస్తారనే రకరకాల చర్చ కూడా నడుస్తోంది.