17-09-2025 07:52:01 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్, పెంచికల్ పేట్ మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే రహదారులన్నీ బురదమయంగా ఉండడంతో ప్రయాణం చేయాలంటే నానా తంటాలు పడాల్సిన పరిస్థితిగా మారిందని గిరిజనులు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆటోలు, బస్సులు తదితర వాహనాలు సైతం గిరిజన గ్రామాలకు రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్సులు సైతం వెళ్లలేని దుస్థితి ఉందని ప్రజలు తెలుపుతున్నారు.
బెజ్జూర్, పెంచికల్ పేట్ మండల కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం రావాలంటే ద్విచక్ర వాహనాలు, ఎడ్లబండ్ల సహాయంతో రావలసిన పరిస్థితి నెలకొందని ప్రజలు తెలుపుతున్నారు. అటవీ శాఖ అనుమతులు లేక ఓర్రెలపై వంతెనలు, రహదారులకు అనుమతులు రాక ప్రతి ఏటా వర్షాకాలంలో గిరి పల్లె ప్రజల గోస వర్ణాతీతం. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఒర్రెలపై వంతెనలు, రోడ్ల అనుమతులు ఇప్పించేలా చూడాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.