6 March, 2026 | 4:37 AM

కుమ్మెర ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్

06-03-2026 02:55 AM
  1. పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీకి నోటీసులు జారీ

24లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశం

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 5 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర లో దళిత కుటుంబంపై జరిగిన దాడి, రెండు నెలల పసికందు మృతిపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. గురువారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయిం ట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి, న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దళిత కుటుంబంపై ఇంతటి దారుణం జరిగినా, పసికందు ప్రాణాలు కోల్పోయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.

ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని, తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సీరియస్ అయిన కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్.. రాష్ట్ర డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి ఈ నెల 24లోగా పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. కుమ్మెర గ్రామంలో అసలు ఏం జరిగింది? దాడికి గల కారణాలు ఏమిటి? స్థానిక పోలీసు అధికారులు ఇప్పటివరకు తీసుకున్న చట్టపరమై న చర్యలు తదితర అంశాలన్నింటినీ పొందుపరుస్తూ వివరణాత్మక నివేదికను తమ ముందు ఉంచాలని డీజీపీని ఆదేశించింది.