calender_icon.png 2 December, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ-సిగరెట్లను పట్టుకున్న చేసుకున్న డీఆర్ఐ

02-12-2025 06:59:44 PM

న్యూఢిల్లీ: ట్యూటికోరిన్‌ ఓడరేవులో అక్రమ ఈ-సిగరెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI Officials) స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. చైనా నుండి ఈ-సిగరెట్లను టుటికోరిన్ పోర్టు ద్వారా భారతదేశానికి దిగుమతి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. నవంబర్ 27న టుటికోరిన్ పోర్టులో డీఆర్‌ఐ అధికారులు ఆ కంటైనర్‌ను అడ్డుకున్నారు.

నిఘవర్గాల సమాచారం మేరకు అధికారులు ఆ కంటైనర్లను తనిఖీ చేశారు. ఆ కంటైనర్‌లో ఒక ప్రైవేట్ కంపెనీ కోసం దిగుమతి చేసుకున్న గొడుగులు ఉన్నాయని పత్రాలు సూచించాయి. కంటైనర్‌ను క్షుణంగా పరిశీలించగా వాటివెనుక దాచిపెట్టిన ఇ-సిగరెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో రూ.10.41 కోట్ల విలువైన మొత్తం 45,984 ఈ-సిగరెట్లను, రూ.4.30 లక్షల విలువైన 4,300 గొడుగులను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

విచారణలో అలప్పుజకు చెందిన ఆర్.నాగరాజ్(43), చెన్నైకి చెందిన వి.కె.రాజ్ కుమార్(46), జి.స్వామినాథన్(56) ఆర్థిక ప్రయోజనాల కోసం స్మగ్లింగ్ ఆపరేషన్ ఏర్పాటు చేశారని వెల్లడైంది. వారు ఈ-సిగరెట్లను తూత్తుకుడి నుండి చెన్నైకి అమ్మకానికి రవాణా చేయాలని ప్లాన్ చేశారని అధికారులు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి తూత్తుకుడి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తరువాత పెరురాణి జిల్లా జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.