13 July, 2026 | 4:19 AM

లోక్‌సభలో భార్యాభర్తలు

28-06-2024 01:20 AM

కలిసి సేవలందించిన మాజీ సీఎం, మాజీ ప్రధాని దంపతులు 

ప్రస్తుత లోక్‌సభలో అందరి దృష్టిని ఆకర్షించిన అఖిలేశ్ యాదవ్ దంపతులు

న్యూఢిల్లీ జూన్ 27: యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, ఆయన సతీమణి డింపుల్‌యాదవ్ కొత్త రికార్డు నెలకొల్పారు. 18వ లోక్‌సభలో అడుగుపెట్టిన వీరు మాజీప్రధాని చరణ్ సింగ్, పప్పుయాదవ్ దంపతుల సరసన చేరారు. 

17వ లోక్‌సభలోనే.. 

అఖిలేష్, డింపుల్ 17వ లోక్‌సభలోనూ సేవలందించారు. కానీ వీరు ఒకే సమయంలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించ లేదు. 2019లో అజాంగఢ్ స్థానం నుంచి అఖిలేశ్ నెగ్గగా.. కన్నౌజ్ నుంచి డింపుల్ ఓటమి చెందారు. తర్వాత జరిగిన పరిణామాల్లో అఖిలేశ్ ఎంపీగా రాజీనామా చేశారు. అదే సమయంలో డింపుల్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు.  

అప్పట్లోనే గోపాలన్ దంపతులు.. 

4వ లోక్‌సభలోనే సీపీఐ (మార్సిస్ట్)కి చెందిన గోపాలన్ దంపతులు తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన భార్యాభర్తలుగా రికార్డు నెలకొల్పారు. వారు కేరళ నుంచి ఎంపీలుగా గెలిచారు. ఇకపోతే 7, 8వ లోక్‌సభలో సత్యేంద్ర నారాయణ్ సిన్హా దంపతులు బీహార్ నుంచి గెలిచి ఎంపీలుగా సేవలందించారు. సత్యేంద్ర నారాయణ్ సిన్హా బీహార్‌కు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. 

7వ లోక్‌సభలో.. 

7వ లోక్‌సభలో సత్యేంద్ర నారాయణ్ సిన్హా దంపతులు, చౌదరి చరణ్‌సింగ్ దంపతులు కూడా ఎంపీలుగా సేవలందించారు. వీరు యూపీ నుంచి ఎంపీలుగా విజయం సాధించారు. చరణ్‌సింగ్ భారత ప్రధానిగా కూడా సేవలందించారు. ఇకపోతే 7వ లోక్‌సభలోనే మధు, పరిమళ దంతవాతే దంపతులు జనతా పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచారు. వీరు మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 

చివరగా.. 

ఇక చివరగా 14,16వ లోక్‌సభల్లో పప్పు యాదవ్ దంపతులు ఎంపీలుగా గెలిచి పార్లమెంట్ మెట్లెక్కారు. కానీ వారు వేర్వేరు పార్టీల నుంచి గెలిచారు. వీరు బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 17వ లోక్‌సభలో అఖిలేష్ దంపతులు పార్లమెంటులో అడుగుపెట్టినా ఒకే సమయంలో ఎంపీలుగా లేరు. 18వ లోక్‌సభలో మాత్రం వారు ఎంపీలుగా ఒకేసారి గెలిచి సత్తాచాటారు.