జై సంవిధాన్ అనకూడదా?
స్పీకర్ తీరుపై కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ, జూన్ 27: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లా రోజూ వివాదాల్లో నిలుస్తున్నారు. విపక్ష సభ్యులపట్ల దురుసగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గురవారం కూడా అలాంటి ఘటన సభలో చోటుచేసుకొన్నది. కాంగ్రెస్ నేత శశిథరూర్ గురువారం సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసిన ఆయన చివరలో జై హింద్, జై సంవిధాన్ అని నినదించారు. అనంతరం స్పీకర్‌తో కరనాలనం చేసి తన సీటువద్దకు వచ్చి కూర్చుంటుండగా స్పీకర్ ఓంబిర్లా కల్పించుకొని రాజ్యాంగంపై మాత్రమే ప్రమాణం చేయాలని ఆదేశించారు.
అందుకు అభ్యంతరం తెలిపిన థరూర్.. జై సంవిధాన్ అనటంలో తప్పేముందని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఓంబిర్లా.. ‘నీ సలహాలు నాకు అవసరం లేదు. నేనేం చేయాలో.. ఏం చేయకూడదో నువ్వు చెప్పాల్సిన పనిలేదు. ఇక కూర్చో’ అని దురుసుగా మాట్లాడారు. స్పీకర్ తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. సభలో ఎందరో అభ్యంతరక భాష వాడుతున్నా పట్టించుకోని స్పీకర్.. జై సంవిధాన్ అంటే అభ్యంతరం చెప్పటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో జై సంవిధాన్ అనకూడదా? అని నిలదీశారు.






