06-12-2025 08:57:29 AM
హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 'ఆపరేషన్ కవచ్' (Operation Kavach) పేరుతో నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్(Hyderabad Police Commissionerate) చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. హకీంపేట–టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రజా భద్రతను నిర్ధారించడానికి శాంతిభద్రతల సంసిద్ధత, కొనసాగుతున్న అమలు చర్యలను సమీక్షించారు.