calender_icon.png 6 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హత్యే

06-12-2025 01:12:57 AM

ఆత్మబలిదానం.. రేవంత్ సర్కార్‌దే పాపం

-రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి 

-42 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైంది?

-సీఎం రేవంత్ బాధ్యత వహించాలి: ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 5 (విజయక్రాంతి): సాయి ఈశ్వరాచారి మరణం సాధారణ ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన హత్యేనని రాజ్యసభ ఎంపీ, జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. సాయి ఈశ్వర్ చారి మృతి విషయం తెలియగానే  ఢిల్లీ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రభు త్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైనందునే యువత ఇలాంటి బలిదానాలకు పాల్పడుతోందని ఆవేదనవ్యక్తం చేశారు. తెలంగాణను దేశానికే మోడల్ రాష్ర్టంగా చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ.. బీసీలకు జరుగు తున్న ఈ ద్రోహానికి మీరేం సమాధానం చెబుతారు అని కృష్ణయ్య నిలదీశారు.

మహారాష్ర్ట, బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇక్కడ కులగణన, 42% కోటా జిమ్మిక్కులను కాంగ్రెస్ వాడుకుంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి బీసీల పట్ల రేవంత్ సర్కార్ చిత్తశుద్ధి చూపలేదు. కామారెడ్డి బీసీ డిక్లరే షన్‌లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అని ధ్వజమెత్తారు.

సీఎం రేవంత్ బాధ్యత వహించాలి 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీ హక్కులను కాలరాస్తోందని కృష్ణయ్య ఆరోపించారు. బీసీ నేతలను తప్పుదోవ పట్టించి, బీసీల ఆశలను నీరుగార్చారని మండిపడ్డారు. మోసం చేసిం ది ప్రభుత్వం.. గాయపడింది బీసీల హృదయాలు. అందుకే ఈ ఆత్మహత్యలు. సాయి ఈశ్వర్ మరణానికి సీఎం రేవంత్ రెడ్డే నైతిక బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.

ప్రజా ఉద్యమం తప్పదు

యువత ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ర్టవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం  ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావని, యువత ధైర్యంగా ఉండి హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సాయి ఈశ్వర్ లాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.