హైదరాబాద్ యూటీ కాదు
బీజేపీకి అలాంటి ఆలోచనే లేదు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం కూల్చం
మూడో కూటమికి అవకాశమే లేదు
ఉంటే లిక్కర్ ఫ్రంట్ ఉండొచ్చు
ఈడబ్ల్యూఎస్ ద్వారా ముస్లిం రిజర్వేషన్లకు ఓకే
టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఉద్దేశం బీజేపీకి లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో రేవంత్‌రెడ్డి సర్కారు కూలితే కూలొచ్చని పేర్కొన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించడం, బలం పెంచుకోవటంపై బీజేపీ దృష్టి పెట్టిందని చెప్పారు.
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా బీజేపీకి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోందని, లోక్‌సభ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఉన్నంత సానుకూల వాతావరణం బీజేపీకి గతంలో ఎప్పుడూ లేదని చెప్పారు. 2014 తర్వాతే దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. అవినీతికి పాల్పడితే ప్రతిపక్షాలనే కాదు బీజేపీ నేతలను కూడా వదలబోమని స్పష్టం చేశారు.
పాక్‌ను ఏకాకిని చేశాం
దేశంలో నేడు మతకల్లోలాలు, ఐఎస్‌ఐ కార్యకలాపాలు కనుమరుగయ్యాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్‌ను ఏకాకిని చేశామని చెప్పారు. మోదీ ప్రధాని కావడానికి ముందు తర్వాత వచ్చిన మార్పులను గమనించాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్లతో రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మిస్తున్నామని వెల్లడించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ ముమ్మాటికీ వ్యతిరేకమని స్పష్టంచేశారు. ప్రస్తుతం దేశంలో అగ్రవర్ణాల పేదలకు ఇస్తున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లు ముస్లింలకు వర్తించేలా చేస్తామని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారెంటీ ఉందని, అందుకే దేశం కోసం మన రాష్ట్రం అభివృద్ధి కోసం బీజేపీతో చేరాలని ప్రతిపక్షాలను కోరుతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.
బీఆర్‌ఎస్ గద్దె దిగేందుకు పదేళ్లు పట్టిందని, కాంగ్రెస్‌కు 5 ఏళ్లు చాలా ఎక్కువని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ‘హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న చర్చ రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా? హైదరాబాద్‌ను యూటీ చేస్తామని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? అధికారం పోయిన తర్వాత కొందరికి పీడకలలు పెరిగిపోయాయి. అలాంటిదే ఈ అర్థం లేని విమర్శ. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ను యూటీ మార్చబోం’ అని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని.. భవిష్యత్తులోనూ ఎవరితో తమకు పొత్తుండదని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.




