calender_icon.png 26 October, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండెక్కుతున్న హైదరాబాద్ ప్రభ

26-10-2025 01:25:37 AM

ఆవలి తీరానికి చేరుతున్న పెట్టుబడులు

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు!

* దక్షిణ భారతదేశంలో ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందిన మకుటం.. మన భాగ్యనగరం..! ముత్యాల నగరంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరం హైదరాబాద్.. పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్‌కు ఏ నగరమూ సాటి రాలేదు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ముందు హైదరాబాద్ వెలవెలబోతున్నది. ఇన్నాళ్లు పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న భాగ్యనగరం.. క్రమంగా మసకబారుతున్నది. నాయకత్వ లోపం, పాలనాస్తబ్దత, పెట్టుబడిదారుల విశ్వాసం కొరవడటం కారణాలుగా కనిపిస్తున్నాయి.

* తెలంగాణలో మంత్రులు, ఆర్థిక శాఖాధికారులు, లేదా ఢిల్లీలోని ఏఐసీసీ నాయకులు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. ‘వాళ్లు మనల్ని పెట్టుబడిదారులుగా కాకుండా రాజకీయ అనుబంధాల ప్రకారం చూస్తారు.. బీజేపీ మిత్రుడా, లేక కాంగ్రెస్ మనిషా.. అని అడుగుతారని ఫార్చ్యూన్ 500 కంపెనీ ప్రతినిధి ఒకరు అన్నారు.

హైదరాబాద్.. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందిన పెట్టుబడిదారులకైనా ఈ నగరం పేరు సుపరిచితమే. ఏ అంతర్జాతీయ కంపెనీ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ప్రారంభించాలనుకున్నా.. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తమ సంస్థ విస్తరణ చేపట్టాలనుకున్నా వాటికి ముందు గుర్తొచ్చే నగరం హైదరాబాద్. దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా పారిశ్రామికంగా, ఉపాధి కల్పనలో అత్యంత ప్రభావం చూపే నగరాల్లో హైదరాబాద్ కీలకమైన స్థానానికి చేరుకున్నది.

దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల కంటే అద్భుతంగా రాణిస్తూ దేశానికే దిక్సూచిగా నిలిచింది. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. కానీ అంతటి ఘనకీర్తిని సాధించిన హైదరాబాద్ నగర ప్రతిష్ట క్రమంగా మసకబారుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం ప్రపంచస్థాయి నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందింది.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఆధ్వర్యంలో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఒకప్పుడు ‘భారత టెక్ రాజధానిగా’ వెలుగొందిన హైదరాబాద్ ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోతున్నది. ఈ పరిస్థితికి ప్రధానంగా నాయకత్వ లోపం, పాలనా స్తబ్దత, పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవడం వంటి అంశాలు కారణాలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రస్థానంలో నిలిచింది.

కానీ నేడు స్పష్టమైన దిశానిర్దేశం లేదు. పెట్టుబడిదారులు ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమ యంలో పడిపోతున్నారు. విధానాల్లో స్పష్టత లేకపోవడంతో దీనిని ఆంధ్రప్రదేశ్ సానుకూలంగా మల్చుచు కుంటుంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ లాగా పెట్టుబడులకు ఆకర్షణీయమైన విధానాలు తెలంగాణలో లేవు. డీప్ టెక్, సెమీకండక్టర్, ఈవీ పాలసీలు ఆలస్యం అవుతున్నాయి. అమలుకూడా నత్తనడకన సాగుతోంది.

అధికార వ్యవస్థలో ఆలస్యం, అవినీతి.. పెట్టుబడిదారుల్లో నిరాశను కలిగిస్తోంది. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయం లేదు. కేటీఆర్ లాగా నిర్ణయాలను వేగంగా తీసుకుని, పెట్టుబడిదారుల విశ్వాసం పొందే నాయకుడు ప్రస్తుతం కనిపించడం లేదు. దీంతో విశాఖపట్నం, అమరావతి పెట్టుబడుల కొత్త కేంద్రాలుగా మారుతున్నాయి. చంద్రబాబు ద్వయం విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో దూకుడు చూపుతున్నది. 

హామీలు కేవలం రూ. 3 లక్షల కోట్లే.. 

ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో కీలకమైన నగరం హైదరాబాద్. కానీ ఇప్పుడు తూర్పు తీరంలోని విశాఖపట్నం నీడలో మసకబారినట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రపంచవ్యాప్తంగా చేసిన రోడ్‌షోలు వల్ల ఆ రాష్ట్రానికి దాదాపు రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. దీనితో పోల్చితే తెలంగాణకు వచ్చిన పెట్టుబడి హామీలు కేవలం రూ. 3 లక్షల కోట్లు మాత్రమే.

ఇది కేవలం సంఖ్యల వ్యత్యాసం మాత్రమే కాదు.. రాజకీయ జడత్వం, అధికార వ్యవస్థలోని ఆలస్యాలు, నాయకత్వం లోపించిన పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. హైదరాబాద్ నగరంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న కలలు ఇప్పుడు నిరాశగా మారుతున్నాయి. కేటీఆర్ ఐటీ, పరిశ్రమల మంత్రిగా ఉన్న రోజుల్లో, హైదరాబాద్ దేశంలోనే కాక ఆసియాలో కూడా టెక్నాలజీ కేంద్రంగా ఎదిగింది.

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలను ఆకర్షించేందుకు సింగిల్ విండో పద్ధతి, ఔషధ పార్కులు, ‘జీరో బ్యూరోక్రసీ’ విధానం వంటి మార్పులు తీసుకొచ్చారు. 2014 నుంచి 2023 వరకు కేటీఆర్ నాయకత్వంలో 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దాంతో 1.5 లక్షల ఉద్యోగాలు లభించాయి. దీనితో ఆర్థిక రంగంలో ఆయనకు ‘యంగ్ టైగర్’ అనే పేరు వచ్చింది. గతంలో అనుమతులు నెలల తరబడి కాకుండా రోజుల్లో పూర్తయ్యేలా సంస్కరణలు జరిగాయి. ఇప్పుడు ఆ వేగం, ఆ పరిస్థితి కనిపించడం లేదు.

హైదరాబాద్ ఎందుకు వెనుకబడింది?

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ‘కొత్త ఉదయం’ వస్తుందని హామీ ఇచ్చారు. కానీ దానికి బదులు రాష్ట్రం బ్యూరోక్రాటిక్ మబ్బులో చిక్కుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు తెలంగాణలో ఆమోదించిన పరిశ్రమల పెట్టుబడులు మొత్తం 1,125 యూనిట్లకు గానూ కేవలం రూ. 6,008 కోట్లు మాత్రమే. ఇది కేటీఆర్ కాలంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే గణనీయంగా తగ్గింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత పనితీరును కనబరుస్తున్నది. 2025 అక్టోబర్‌లోనే ఆ రాష్ర్ట పెట్టుబడుల మండలి రూ. 1.14 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది. అందులో గూగుల్ రూ. 87,000 కోట్లు విలువైన డేటా సెంటర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. దీంతో పోల్చితే హైదరాబాద్‌లో గత 18 నెలల్లో సంతకమైన రూ. 2.2 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు అనుమతులు, పరిపాలనా ఆలస్యం వల్ల కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో వైజాగ్ నగరం పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ స్థానాన్ని దక్కించుకుంటుంది.

చంద్రబాబు నాయుడు ‘విజన్ 2050’ ప్రణాళికలో భాగంగా 2024-25లో రూ. 4.47 లక్షల కోట్లు పెట్టుబడుల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించి రూ. 24,590 కోట్ల విలువైన పనులను మళ్లీ ప్రారంభించగా, రూ.19,685 కోట్లు విలువైన ప్రాజెక్టులు పూర్తిచేశారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు, సెమీకండక్టర్ పరిశ్రమలు వంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా ముందుకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మద్దతుతో ఈ ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు మరింత వేగంగా అమలు చేస్తున్నారు.

అద్భుత నగరం హైదరాబాద్..

హైదరాబాద్ సహజంగానే అభివృద్ధికి అనువైన నగరం. ప్రపంచస్థాయి పెట్టుబడులు, పరిశ్రమలు రావడానికి అవసరమైన అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి. ఇవే ఈ నగరాన్ని పెట్టుబడులకూ, జీవన ప్రమాణాలకూ అత్యుత్తమ కేంద్రంగా నిలబెట్టాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని 100కి పైగా నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. ఓఆర్‌ఆర్, ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో రైలు వంటి సౌకర్యాలతో నగరంలో వేగవంతమైన కనెక్టివిటీ ఉంది. మంజీరా, గోదావరి, కృష్ణా నీటిపథకాలు ద్వారా తగిన నీటి సరఫరా, విద్యుత్ సరఫరా స్థిరంగా, పరిశ్రమలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందుబాటులో ఉంటుంది. 

మానవ వనరులు, మౌలిక వసతులు..

హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యత పొందిన ముఖ్య కారణాల్లో ఒకటి ఇక్కడ ఉన్న ప్రతిభావంతులైన మానవవనరులు. అందుకే నగరం ఐటీ, బయోటెక్, ఫార్మా, స్టార్టప్ హబ్‌గా ఎదిగింది. 8 లక్షలకుపైగా ఐటీ నిపుణులు హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. గ్లోబల్ కంపెనీల కోసం సాఫ్ట్‌వేర్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోబైల్, వెబ్ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు.

జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, బయోకాన్ క్యాంపస్‌లు వంటి పరిశోధన కేంద్రాలు, ఫార్మా, బయోటెక్ పరిశ్రమలకు శాస్త్రీయ నైపుణ్యం, పరిశోధన సామర్థ్యం అందుబాటులో ఉంది. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్, టాస్క్ వంటి ఇన్నోవేషన్, స్టార్టప్ హబ్‌లు ఉన్నాయి. యువ ప్రతిభావంతులు కొత్త టెక్నాలజీ, డిజిటల్ ప్రాజెక్ట్‌లు ప్రారంభించే సామర్థ్యం కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లోని అత్యుత్తమ మౌలిక వసతులు నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి.

ఫైబర్ ఆప్టిక్, 5 జీ, డేటా సెంటర్లు డిజిటల్ వ్యాపారం కోసం సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణా కేంద్రాలు, నైపుణ్యవంతులైన యువతకు ప్రత్యక్ష పరిశ్రమ అనుభవం కూడా ఉంది. పెట్టుబడిదారులు భూమిని ప్రైవేట్, ప్రభుత్వ రంగం ద్వారా సులభంగా లీజు/కొనుగోలు చేసుకోవచ్చు. పెద్ద ప్రాజెక్టులు కోసం ప్రాథమిక సౌకర్యాలు, రోడ్లు, ప్లాంట్ సెట్-అప్, లాజిస్టిక్స్ సిద్ధంగా ఉన్నాయి. 

సురక్షిత వాతావరణం..

హైదరాబాద్ నగరంలో నేరాల శాతం జాతీయ సగటు కంటే  చాలా తక్కువగా ఉండటం పారిశ్రామికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. క్రైమ్ రేటు తక్కువగా ఉండటం ద్వారా పెట్టుబడిదారులకు సురక్షితమైన వాతావరణం లభిస్తుంది. ఇక్కడి వాతావరణం నగరాన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, జీవన ప్రమాణాల కోసం సౌకర్యవంతంగా మార్చింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, బయోటెక్ వంటి పరిశ్రమలు అంతరాయం లేకుండా పని చేయగలవు. సీజనల్ వాతావరణం పరిశ్రమల పనితీరుపై ప్రతికూల ప్రభావం లేకుండా ఉంటుంది. 

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు కేటీఆర్ కృషి..

తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ, ఇండస్ట్రీస్, స్టార్టప్‌ల శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్న సమయంలో హైదరాబాద్ ‘ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రం’గా మారింది. ఆయన వ్యూహాత్మక చర్యల ద్వారా నగరానికి గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. పెట్టుబడిదారుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చేందుకు టీఎస్ ను ప్రారంభించారు. విదేశీ పెట్టుబడిదారులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటంతోపాటు దావోస్, వాషింగ్టన్ రౌండ్ టేబుల్, టోక్యో, దుబాయ్ రోడ్‌షోల ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్ వైపు ఆకర్షించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు కుదిర్చారు. హైదరాబాద్‌ను ‘సిటీ ఆఫ్ స్టార్టప్స్’గా ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చారు. 

అన్నీ ఉన్నా ఉపయోగం లేదు..

హైదరాబాద్ దగ్గర విజయానికి కావలసిన అన్ని వనరులు ఉన్నా, అవి నిరుపయోగంగా మారుతున్నాయి. హైదరాబాద్‌ను వైజాగ్ నగరం అధిగమించి ముందుకు దూసుకుపోతున్నది. వైజాగ్‌కు ఇంకా మౌలిక వసతులు పూర్తిగా సిద్ధం కాలేదు, వాతావరణం కూడా తేమతో నిండినదే. అయినా, విశాఖ ఇప్పుడు పెట్టుబడిదారుల కొత్త ఆకర్షణగా మారుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ 2025లో రూ. 1.79 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినట్లు చెబుతున్నా, అవి అమల్లో మాత్రం ఆగిపోయాయి.

బ్యూరోక్రాట్లు ఏర్పాటు చేసిన సింగిల్ విండో పోర్టల్ రోజుకి ఎక్కువ సార్లు హ్యాంగ్ కావడంతో అనుమతులు ఇవ్వడంలో విఫలమవుతోంది. అయితే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆసక్తి కనబరుస్తున్నా.. అధికార యంత్రాంగం నుంచి పూర్తిస్థాయిలో సహకారం లభించడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతోపాటు పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటు అంశంలో  సీఎం రేవంత్‌రెడ్డి అనధికార సలహాదారులుగా చెప్పుకునే మధ్యవర్తుల జోక్యం రోజురోజుకూ పెరిగిపోవడం కూడా ప్రస్తుత పరిస్థితి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఆయా శాఖ మంత్రులు, ఆర్థిక శాఖాధికారులు, లేదా ఢిల్లీలోని ఏఐసీసీ నాయకత్వం అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు.

ఈ గందరగోళం కారణంగా పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. ‘వాళ్లు మనల్ని పెట్టుబడిదారులుగా కాకుండా రాజకీయ అనుబంధాల ప్రకారం చూస్తారు.. ‘బీజేపీ మిత్రుడా, లేక కాంగ్రెస్ మనిషా’ అని అడుగుతారు.’ అని ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ ప్రతినిధి అన్నారు. 

తెలంగాణలో మొదట పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికినా, తర్వాత వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికార విభాగాలు పరస్పరం తగువులాడుతుండటంతో నిర్ణయాలు ఆగిపోతున్నాయి. అధికార వ్యవస్థలో అవరోధాలు ఎదుర వుతున్నాయి. ఫైళ్ళు ఒక శాఖ నుంచి మరో శాఖకు తిరగడం, లంచం లేకుండా పనులు కాకపోవడం కన్పిస్తుంది. నిర్ణయాత్మక శక్తిగా ఎవరినీ పరిగణించే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు.

పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా ఇచ్చే మంత్రులు, అధికారయంత్రాంగం కరువైంది. పెట్టుబడిదారులకు అడుగడుగునా మోకాలడ్డేవారే కనిపిస్తున్నారు. ముందస్తుగానే పర్సెంటేజీల భాగోతం నడుస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. కేటీఆర్ ఉన్నప్పుడు ఆయనే ఆ మార్గదర్శిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ద్వారా ఒక్కరే రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగారు. విశాఖపట్నం 2025లో ఆంధ్రప్రదేశ్ జీడీపీకి 15 శాతం వాటా అందించింది.

ఇది గతంలో 8 శాతంగా ఉండేది. ఎఫ్‌డీఐ (విదేశీ పెట్టుబడులు) కూడా రూ. 2 లక్షల కోట్లుకు పెరిగాయి. హైదరాబాద్ వృద్ధి రేటు మాత్రం 7 శాతం వద్దే నిలిచిపోగా, ఆంధ్రప్రదేశ్ 14 శాతం వృద్ధి దాటింది. ఫార్మా కంపెనీలు జీనోమ్ వ్యాలీ నుంచి బయటకు వెళ్లి ఆంధ్ర తీర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నాయి. ఐటీ సంస్థలు కూడా కొత్త విస్తరణ ప్రణాళికలను అమరావతికి మళ్లిస్తున్నాయి. 

ఏపీ వైపు మొగ్గు..

ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ పాలసీ-2024 కింద కంపెనీలకు 30 శాతం పెట్టుబడి సబ్సిడీ, భూమి రాయితీలు ఇస్తోంది. దాంతో ఎన్‌విడియా, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజాలు ఆకర్షితమవుతున్నాయి. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహక ప్రణాళికలోని లక్ష్యాలు వెనుకబడిపోయాయి. డ్రైవ్, స్ట్రాటజీ విషయంలో కూడా తేడా స్పష్టంగా ఉంది. నారా లోకేష్ సిలికాన్ వ్యాలీకి వెళ్లి రూ. 45,000 కోట్ల ఏఐ ఒప్పందాలు చేసుకున్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రెండు రాష్ట్రాలు 98.78 శాతంతో సమానంగా ఉన్నప్పటికీ, అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. అక్కడ సింగిల్ డెస్క్ క్లియరెన్స్‌కు 15 రోజులు పడుతుంటే, తెలంగాణలో అదే పనికి 45 రోజులు పడుతోంది. తెలంగాణలో అవినీతి కూడా ఆందోళనకరంగా ఉంది. అవినీతి బయటపడిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ‘జీరో టాలరెన్స్’ ధోరణి స్పష్టమవుతున్నది.

కేటీఆర్ కావాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో సీఎంగా కేటీఆర్ కావాలని అభిప్రాయాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ దిశగా చర్చ జరుగుతున్నది. సర్వేల్లో 62 శాతం మంది కేటీఆర్ పునరాగమనం కోరుతున్నారు. త్వరితగతిన నిర్ణయాలు, మాట నిలబెట్టుకోవడం వంటి కేటీఆర్ వ్యవహార శైలి ఇందుకు కలిసివస్తున్నది. దీంతోపాటు బీఆర్‌ఎస్-బీజేపీ పొత్తు గురించి చర్చలు కూడా బలపడుతున్నాయి.

‘ఆంధ్రలో చంద్రబాబునాయుడు-బీజేపీ కలయిక వల్ల కేంద్ర నిధులు, పీఎల్‌ఐ పథకాలు, మౌలిక సదుపాయాల నిధులు వచ్చాయి. తెలంగాణలో కూడా అదే మార్గం అవసరం’ అనే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డికి, ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకత్వంతో ఉన్న సంబంధాలు క్రమంగా దూరమవుతున్నాయి. ఇప్పటికైనా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో కేటీఆర్ మోడల్‌ను పునరుద్ధరించాలి.

దుబాయ్, టోక్యో వంటి నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించి, ఆంధ్రస్థాయిలో అనుమతుల వ్యవస్థను వేగవంతం చేయాలి. అన్ని అనుమతులు పూర్తిగా డిజిటల్‌గా మార్చాలి. లేని పక్షంలో హైదరా బాద్‌కు ఎన్ని సానుకూలతలు ఉన్నా అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి కేటీఆరే అత్యుత్తమ ప్రత్యామ్నాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తక్షణ నిర్ణయాలు తీసుకోవడం, పెట్టుబడిదారులతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆయనకు అలవాటు. దీంతోపాటు బీజేపీతో పొత్తు కుదిరితే, కేటీఆర్‌కి కేంద్రం నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. దీంతో తెలంగాణకు కూడా పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. మళ్లీ ‘హైదరాబాద్ భారత టెక్ రాజధాని’గా వెలుగుతుంది.

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి