26-10-2025 01:16:57 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి పెను సవాల్‌గా మారింది. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుకు కీలకం కానుంది. అసలు పరీక్ష ఈ ఇద్దరికే అని చెప్పాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోనిదే. ఇక్కడి ప్రజలు గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసినవారే.
అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఉప ఎన్నిక ఆయనకు మొదటిది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కం టే కూడా వీరిద్దరికే ఈ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. బీజేపీ అభ్యర్థి ఎంపికలోనూ వీరిద్దరిదే ఫైనల్ నిర్ణయం కావడం, జాతీయ నాయకత్వం కూడా వీరిపై భరోసా పెట్టి పూర్తి బాధ్యతలను అప్పగించింది.
కిషన్‌రెడ్డి అన్నీ తానై..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఈ విజయం ఎంత అవసరమో బీజేపీకీ అంతే అవస రం. బీజేపీకి సెమీ ఫైనల్‌గా మారిన ఈ ఎన్నికలో రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికి కిషన్‌రెడ్డిపై ఉన్న పూర్తి నమ్మకంతో పార్టీని గెలిపించే బాధ్యతలను ఢిల్లీ నాయకత్వం ఆయనపై మోపింది. ఈ క్రమంలోనే ప్రచారంలో అన్నీ తానై గెలుపునకు కృషిచేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం మిగతా పార్టీలకు దీటుగా 40మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది.
వారంతా విడతల వారీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భవిష్యత్‌లో రాబోయే ఎన్నికలకు జూబ్లీహిల్స్ బైపోల్ కాషాయ పార్టీకి సెమీ ఫైనల్‌గా మారనుంది. దీని ప్రభావం ఒకవేళ స్థానిక ఎన్నికలు జరిగితే వాటిపైన కూడా పడనుంది. పైగా ఈ ఎన్నికల్లో బీజే పీ తమ సత్తా చాటితే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పుంజుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఆతర్వాత జరిగే జీహెఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీకి మంచి మైలేజ్ లభించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కార్యకర్తల్లో విశ్వాసానికి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఈ గెలుపు చాలా కీలకం. ఎందుకంటే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అసెంబ్లీ ఉప ఎన్నిక. ఈ విజయం ఆయనకు మరింత బూస్ట్‌ను అందివ్వనుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉత్సాహంగా పనిచేసేందుకు దోహద పడుతుంది. కార్యకర్తల్లోనూ ఓ నమ్మకం, భరోసా కల్పించే వీలుంటుంది. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనను చూసిన ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.
కాగా, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పలు హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిలైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రజల్లో కొంత బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకునేందుకు ఆవైపుగా చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో 8 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటుంది.
దానికను గుణంగానే ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు, పార్టీల్లోని అంతర్గత గొడవలు, మోదీ చరిష్మా తదితర అంశాలతో ముందుకు పోతోంది. మరీ వీరిద్దరు నేతలు జోడెద్దుల్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఈ సీటును మోదీకి గిఫ్ట్ ఇస్తారా? లేదో చూడాలి.