26-10-2025 01:03:33 AM
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్ ఎంఐఎస్)కు ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఇతర ఉద్యోగులు, సిబ్బంది కచ్చి తంగా ఆధార్ లింక్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
25 అర్ధరాత్రి వరకు అందరూ ఆధార్ లింక్ చేయాలని అందులో స్పష్టం చేశారు. లేదంటే వేతనాలు నిలిచిపోతాయని ఆర్థిక శాఖ పేర్కొంది. అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. అయితే వీరి పేర్లు, ఆధార్, హోదా, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10వ తేదీ వరకు ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని గత నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సగం మంది కూడా..
ఈనెల 16 వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే వివరాలు ఇవ్వని జీతాల బిల్లులు ఈనెలలో ఆమోదించేది లేదని ఆర్థిక శాఖ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగుల సమగ్ర వివరాలన్నీ లేకపోవడంతో కొన్ని శాఖల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నాయి.
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా, సెలవుల్లో వెళ్లినా వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బోగస్ ఉద్యోగులు సైతం ఉన్నారనే విమర్శలున్న నేపథ్యంలో ఆధార్ లింకును జతచేస్తే అసలైన ఉద్యోగుల వివరాలు తెలుస్తాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అధికారులను సస్పెండ్ చేయాలి
ఇంత వరకు ఏ యే శాఖల్లో ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయలేదో ఆ శాఖ హెచ్‌ఓడీ, ఎండీ, ఉన్నత అధికారులను సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య కోరారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చినా కూడా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారులు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం తీసుకునే అధికారులు...తమ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ వారికి తెలియదని శనివారం ఒక ప్రటన విడుదల చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
పులి లక్ష్మయ్య,
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రెసిడెంట్