calender_icon.png 26 October, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ పదవీ లేనోళ్లకే డీసీసీ?

26-10-2025 01:08:20 AM

  1. ఈ నెల 29న లేదా నవంబర్ మొదటి వారంలో ప్రకటన 
  2. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో సీఎం, 
  3. డిప్యూటీ సీఎం భేటీ 
  4. డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చ 
  5. పరిశీలకులు ఇచ్చిన నివేదికపై కసరత్తు

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో ఏ పదవీ లేని వారికే డీసీసీ పీఠం కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ప్రభుత్వంలో, పార్టీలో పలు పదవుల్లో ఉన్న వారికి కాకుండా ఏ పదవీ లేనివారికి, సామాజిక సమీకరణాలు, నేతల శక్తి సామర్థ్యాలను చూసి డీసీసీ పదవులు ఇవ్వాలని కసరత్తు చేస్తున్నట్లు తెలు స్తోంది.

ఇందులో భాగంగానే  ఢిల్లీలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. ఈనెల 29న లేదా నవంబర్ మొదటి వారంలో డీసీసీల ఎంపికకు సంబంధించిన ప్రకటనను చేయనున్నారు. ఈ భేటీలో ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీసీసీల ఎంపికపై నేతల నుంచి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా ఏఐసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన నివేదికపై కసరత్తు చేశారు. అయితే పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకోవడంతో అబ్జర్వర్ల నివేదికలపై దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ నేతలతో కేసీ.వేణుగోపాల్ చర్చించారు. అనంతరం ఒక్కో నేతతో వేణుగోపాల్ ప్రత్యేకంగా భేటీ అయి వారి అభిప్రాయాలను విడి విడిగా తీసుకున్నారు. వివిధ సామాజిక వర్గాలకు డీసీసీ పదవుల్లో అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.