11 April, 2026 | 5:15 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!

11-04-2026 03:44 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్(Ailapuram)లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఐలాపూర్ లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్ల కుండా హైడ్రా చర్యలు చేపట్టింది. ఐలాపూర్‌లో అజీమ్ అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేస్తోంది. భవనంలో ఎవరూ నివాసం ఉండట్లేదని హైడ్రా అధికారులు గుర్తించారు. భవన నిర్మాణదారుడు కొంతమందిని అద్దెలకు దించి నివాసాలున్నట్లు చూపించినట్లు హైడ్రా సూచించింది.  భవనంలో ఉన్నవారిని హైడ్రా అధికారులు ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తున్నారు.

కమిషనర్ రంగనాథ్ వివరణ  20 ఏళ్లుగా ముఖీమ్ భూదందా

ఐలాపూర్ లో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) వివరణ ఇచ్చారు. ఐలాపూర్ లో భూములపై 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖీమ్ ఫాంహౌస్ నిర్మించుకున్నాడని రంగనాథ్ వెల్లడించారు. ఫాంహౌస్ కేంద్రంగా ముఖీమ్ ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డాడని రంగనాథ్ సూచించారు. 2006లో నిర్మించిన ఫాంహౌస్ ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించాడని వివరించారు. 20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విక్రయించి కోట్లు సొమ్ము చేసుకున్నారని తెలిపారు. ముఖీమ్ 100 గజాలకు రూ. 10 లక్షల చొప్పున పేదలకు విక్రయించినట్లు రంగానాథ్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ముఖీమ్ భూ ఆక్రమణలకు పాల్పడ్డాడని తెలిపారు. ఐలాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.