calender_icon.png 1 May, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను పాకిస్థానీని కాదు!

25-04-2025 12:00:00 AM

కశ్మీర్‌లోని పహల్గాం హిల్ స్టేషన్‌లో జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ ఘటనతో దేశం మొత్తం అట్టుడుకు తోందిప్పుడు. అయితే భారత ప్రభుత్వం పాకిస్థాన్ విషయంలో పలు ఆంక్షలు విధించింది. మరోవైపు పాకిస్థాన్ నటీనటులను మన సినిమాల్లో నటింపజేయకూడదన్న డిమాండ్ తీవ్రస్థాయిలో వినిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ చిత్రంలోని హీరోయిన్ ఇమాన్వీ ఎస్మాయిల్ పాకిస్థాన్ మూలాలు ఉన్న వ్యక్తి అని చర్చించుకుంటున్నారు. ఇమాన్వీ తండ్రి పాకిస్థాన్ మిలిటరీలో పనిచేశారని, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ ఆమె ప్రభాస్‌తో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ ప్రచారంపై ఇమాన్వీ తాజాగా సోషల్‌మీడియా వేదికగా స్పందించింది. జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ.. అందులో బాధితులైన వాళ్లందరికీ సంతాపం వ్యక్తం చేసింది. ఇలాంటి వైలెన్స్‌ను తాను ఖండిస్తున్నానని పేర్కొంది. అలాగే తన ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైనా స్పందించింది. “మా కుటుంబం నుంచి ఎవరికీ పాకిస్థాన్ మిలిటరీతో సంబంధంలేదు.

ఈ విషయం ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు. ఇదే కాదు ఎన్నో విషయాల్లో నా గురించి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరుగుతోంది. బాధ్యత కలిగిన జర్నలిస్టులు, మీడియా అవుట్‌లెట్‌లు కూడా సోషల్‌మీడియాను అనుసరిస్తున్నారే కానీ, నిజానిజాలు తెలుసుకోకుండా స్పందిస్తున్నారు.

ఈ విషయం నన్ను బాధించింది. నేను ఒక ప్రౌడ్ ఇండియన్ నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లిష్ మాట్లాడతాను. మా తల్లిదండ్రులు యూత్ లో ఉన్నప్పుడే అమెరికాలోని లాస్‌ఏంజిల్స్, కాలిఫోర్నియాకు షిఫ్ట్ అయ్యారు. వారు అమెరికా పౌరులయ్యారు. అమెరికాలో నా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా మారాలనుకున్నాను.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు వచ్చిన అవకాశాలకు నేను చాలా కృతజ్ఞురాలిని. కచ్చితంగా నేను భారత మూలాలున్న వ్యక్తిని. భారతీయత, భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించండి. దయచేసి ఈ విషయంలో నన్ను బ్యాడ్ చేయకండి” అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.