01-05-2025 06:27:46 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆశ్రమ బాలుర పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిని కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, చేయవలసిన మరమత్తులు గురించి పూర్తి వివరాలను ప్రధాన ఉపాధ్యాయులు బద్రుని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పునః ప్రారంభం నాటికి పాఠశాలల్లో అన్ని సమస్యలు, మరమ్మతులను పూర్తి చేయాలన్నారు.
పాఠశాల భవనానికి రంగులు వేయడం కోసం ఎంత ఖర్చవుతుంది, ఏ రంగులు వేయాలి తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఆశ్రమ పాఠశాలను ఎంపిక చేసి పాఠశాల భవనానికి రంగులు వేయాలన్నారు. అనంతరం ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు నూతన రంగులు వేసి పాఠశాలలో పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు నూతన హంగులతో స్వాగతం పలకాలన్నారు. ఈ పరిశీలనలో పాఠశాల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.