11-10-2025 12:00:00 AM
‘ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఉండగా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’ అంటూ రుసరుసలాడింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొణె. తన పనిగంటల విషయంలో దీపికా పలు నిబంధనలు పెట్టడం.. ‘కల్కి2898ఏడీ’, ‘స్పిరిట్’ ప్రాజెక్టుల నుంచి మేకర్స్ ఆమెను తొలగించటం వంటి పరిణామాలు విదితమే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల వరుసగా వార్తల్లో నిలు స్తోంది. దీపికా మరోమారు చేసిన హాట్ కామెంట్స్ సోషల్‌మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. “ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే విషయాలను నేను అంగీకరించలేను. భారతీయ చిత్రపరిశ్రమలో ఎందరో స్టార్స్, అగ్ర నటులు చాలా ఏళ్లుగా పని గంటల విషయంలో తమకంటూ నిబంధనలు విధించుకున్నారు. వాళ్ల పేర్లు కూడా నేను చెప్పాలనుకోవడం లేదు. కొంతమంది సోమవారం నుంచి శుక్రవారం వరకే షూటింగ్స్‌లో పాల్గొంటారు.
అయినా 8 గంటల పని విధానం అనేది కొత్త కాదు, రహస్యం అంతకన్నా కాదు. ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లోకెక్కలేదు. ఇలాంటి విమర్శలు నాకేం కొత్త కాదు. చాలాసార్లు ఎదుర్కొన్నాను. అయితే, నేనెప్పుడూ దేనిపైనా ఓపెన్‌గా స్పందించను. నిశ్శబ్దంగా యుద్ధం చేయడమే నాకు తెలుసు. అలా చేస్తేనే అది గౌరవం అనిపించుకుంటుంది” అని తెలిపింది దీపికా పడుకొణె.