calender_icon.png 14 May, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీర్లు కావాలి బ్రో!

14-05-2025 01:36:12 AM

  1. రెండు నెలలుగా అనూహ్యంగా అమ్మకాలు 
  2. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు
  3. కొరతను అధిగమించేందుకు ఆబ్కారీ శాఖ కసరత్తు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో బీర్లకు డిమాండ్ పెరిగింది. వేసవి తాపం నుంచి ఉక్కిరిబిక్కిరవుతున్న మద్యం ప్రియులు బీర్లతో చిల్ అవుతున్నారు. దీంతో రెండు నెలలుగా రాష్ట్రంలో  బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి బీర్ల అమ్మకాలు రెట్టింపయ్యాయి. సాధారణంగా విస్కీ, బ్రాందీ వంటి లిక్కర్‌ను తాగేవాళ్లు సైతం చల్లటి బీర్లనే కోరుకుంటున్నారు.

దీంతో రాష్ర్టంలో బీర్ల కొరత ఏర్పడింది. అందులో ప్రధానంగా కింగ్‌ఫిషర్ బీర్ల కొరతనే ఎక్కువగా ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. బీర్ల కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కింగ్‌ఫిషర్‌తో పాటు ఇతర బీర్లను కూడా  తెప్పించడానికి ఎక్సుజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం పలు మద్యంషాపుల్లో కింగ్‌ఫిషర్ బీర్లు నోస్టాక్ అని దర్శనమిస్తున్నాయి.

మాములుగా వేసవికి ముందే బీర్లకు సంబంధించి బఫ ర్ స్టాక్‌ను ఎక్సుజ్ శాఖ సిద్ధం చేసుకుంటుంది. రాష్ర్టంలోని 17 మద్యం డిపోల్లో వాటి సామర్థ్యాన్ని బట్టి కనీసం రెండు లక్షల బీర్లకు తక్కువ లేకుండా 25 నుంచి 30 లక్షల బీర్లను బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకుంటుంది. అయితే డిమాండ్‌ను బట్టి ఆబ్కారీ శాఖ అధికారులు మద్యం షాపులకు బీర్లను సరఫరా చేస్తుంటా రు.

అయితే ఇందులో కింగ్‌ఫిషర్ బీర్లనే ఎక్కువ కావాలని మద్యం, బార్, పబ్ యజమానులు ఇండెంట్ పంపిస్తుండడంతో బ్రేవరేజేస్ కార్పొరేషన్ మాత్రం ఆచితూచి వాటిని ఆయా షాపులకు పంపిణీ చేస్తోంది. మాములురోజుల్లో ప్రతీరోజు 20 లక్షల కు పైగా బీర్లు అమ్ముడుపోతుండగా, వేసవికాలంలో మాత్రం 30 నుంచి 40లక్షల బీర్లు అమ్ముడవుతుంటాయని ఎక్సుజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

ఏప్రిల్‌లో బీర్ల విక్రయాల ద్వారా రూ.944.54కోట్లు

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 46.46లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా, సుమారు రూ.944.54 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు వచ్చింది. దీంతోపాటు మే నెలలో (ఈ నెల 12వ తేదీ వరకు) సుమారుగా 20 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా రూ.485 కోట్ల ఆదాయం వచ్చిందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏప్రిల్ నెలలో 31.17 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరగ్గా, రూ.2,327.71 కోట్ల ఆదాయం ఈ శాఖకు వచ్చింది.

గతేడాది ఏప్రిల్ బీర్ల విక్రయం ద్వారా రూ.902 కోట్లు 

గతేడాది ఏప్రిల్ నెలలో 50.14 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా రూ.902.28 కోట్ల ఆదాయం ఆబ్కారీ శాఖకు వచ్చింది. దీంతోపాటు 30.6 లక్షల మద్యం కేసుల విక్రయం ద్వారా రూ.2,302.98 కోట్ల ఆదాయం ఆ శాఖకు సమకూరింది. ఇక గతేడాది మే నెలలో 49.19 లక్షల కేసుల బీర్ల విక్రయం ద్వారా రూ.873.87 కోట్ల ఆదాయం రాగా, 34.16 లక్షల మద్యం కేసుల విక్రయం ద్వారా రూ.2,548.87 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. 

కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి..

రాష్ర్టంలో డిమాండ్ తగ్గట్టుగా బీర్లు దొరక్కపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎక్సుజ్ శాఖ అన్వేషిస్తోంది. అయితే బ్రీవరీలకు మూడో షిఫ్ట్‌కు  అనుమతి ఇచ్చి ఉత్పత్తిని పెంచడం లేదా డిమాండ్ అధికంగా ఉండే బ్రాండ్లను కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం లాంటి చర్యలను ఎక్సుజ్ శాఖ చేపడుతోంది.

బీరుప్రియులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లలో ప్రధానంగా కింగ్‌ఫిషర్, బడ్వుజర్, నాక్‌ఔట్, రాయల్ ఛాలెంజ్, కార్లస్బెర్గ్, హైవార్డ్స్, టుబర్గ్, కరోనా తదితర రకాలు ఎక్కువ అమ్ముడుపోతుంటాయి. రాష్ర్టంలో ఆరు బ్రీవరీ కంపెనీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రెండు లక్షలు మేర బీర్లు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది.  

గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల వాటా ఎక్కువ

ప్రతీ సంవత్సరం బీర్ల విక్రయంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని షాపులే ముందంజలో ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 498.69 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వగా, 2019-20 సంవత్సరంలో 492.26లక్షల కేసులు, 2020-21 సంవత్సరంలో 273.28 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.

2021-22 సంవత్సరం ఒక్క ఏప్రిల్ నెలలో బీర్లు 26,12,694 కేసులు అమ్ముడుపోయాయని ఎక్సుజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2022--23 సంవత్సరం జనవరి నుంచి మార్చి నెల మధ్య 1,01,03,633 బీరు కేసులు అమ్ముడు కాగా,  ఏప్రిల్ నుంచి జూన్ నెలలో 1,54,76,602 బీరు కేసులు, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 99,03,949 కేసులు, అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు నాటికి 1,03,45,925 బీరు కేసులు అమ్ముడయ్యాయి.