27-07-2025 12:51:57 AM
ప్రస్తుతం తనకు ఇష్టమైన జీవన శైలిని తాను అనుసరిస్తున్నానని, గతంలో పోల్చుకుంటే ఈ మార్పు ఎంతో మెరుగైందని చెప్పారు నటుడు విజయ్ దేవరకొండ. ఇంకా తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఎక్కువ టైమ్ ఇవ్వాలని ఉందని కూడా ఆయన తెలిపారు. వ్యక్తిగత విషయాలను పంచుకునేందుకు ఇష్టపడని ఈ రౌడీ హీరో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోయిన్ రష్మికతో రిలేషన్‌లో ఉన్నట్టు ఎంతో కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ కారణంగానే ‘విజయ్ చెప్పిన ఆ గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ?’ అంటూ నెటిజన్లు మరోసారి ఆసక్తికర చర్చకు తెర తీశారు. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే కథానాయకుడు విజయ్ వరుస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్యూవలో విజయ్ మాట్లాడుతూ.. “ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనవి మానవ సంబంధాలే.
గత రెండేళ్లలోనే నాకు వీటి విలువ తెలిసొచ్చింది. ఈ రెండు, మూడేళ్లుగా నా జీవన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలిసి గడపలేకపోయా. అమ్మానాన్నలు, దోస్తులు, గర్ల్‌ఫ్రెండ్ ఎవరికీ సమయం కేటాయించలేకపోయా. ఒకరోజు నాకు నేను ఈ విషయాన్ని తెలుసుకున్నా. అప్పట్నుంచి నా పద్ధతి మార్చుకున్నా. ఇప్పుడు నావాళ్ల కోసం టైమ్ ఇస్తున్నా. వాళ్లందరితో కలిసి విలువైన సమయాన్ని ఆస్వాదిస్తా” అని తెలిపారు.