17-01-2026 03:17:24 AM
జడ్చర్ల, జనవరి 16: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీరామచంద్రుడు లాంటి నిష్కళంక నాయకుడని అలాంటి వ్యక్తిపై అభాండాలు మోపుతూ దుష్ప్రచారం చేయడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి పై చేసిన ఆరోపణలను నిగ్గుతేల్చడానికి వేసిన విచారణ కమిటీలో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.
జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద 17 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల ట్రిపుల్ ఐటీకి శంఖుస్థాపన చేయనున్న నేపథ్యంలో సీఎం రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం అనిరుధ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగానే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కోమటిరెడ్డి పై వచ్చిన ఆరోపణలు చూసి తాను ఎంతగానో బాధపడ్డానని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని,నీతి నిజాయితీలకు ప్రతీక అని అభిప్రాయపడ్డారు.
చిట్టబోయినపల్లి వద్ద శనివారం జరగనున్న జడ్చర్ల ట్రిపుల్ ఐటీ శంఖుస్థాపన,మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభల్లో కార్యక్రమంలో ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మంత్రి వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.