17-01-2026 12:26:46 PM
హన్మకొండ,(విజయక్రాంతి): హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గల ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర(Inavolu Sri Mallikarjuna Swamy Brahmotsavam) సందర్భంగా సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించు కొని ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల మల్లన్న స్వామి దర్శనం కోసం, రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.శివసత్తుల పూనకాలతో, ఒగ్గు, డప్పుడోలు కళాకారుల వాయిద్యాలతో శరణు, శరణు...మల్లన్న అంటూ ఆలయ సన్నిధి మారు మోగింది.ఆలయ ప్రాంగణమం లో భక్తులు పట్నాలు వేసి, బోనాలు చెల్లించి స్వామి వారికి మొక్కలు చెల్లించుకున్నారు.
గురువారం ప్రభ బండి కట్టి ఆలయ ప్రాంగణం చుట్టూ తిప్పి స్వామివారి విగ్రహాలను అంగరంగ వైభవంగా ఊరేగించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలమేరకు మంచినీటి వసతి,తదితర అన్ని ఏర్పాట్లు చేశారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులు కల్పించారు. శ్రీ మల్లికార్జున స్వామి దర్శనంకోసం భక్తుల తాకిడి ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందించే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహక అధికారి సుధాకర్,ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, పాలకవర్గ సభ్యులు తెలిపారు.