9 May, 2026 | 4:31 AM

త్వరలో పాదయాత్ర చేస్తా.. ప్రతి రైతును కలుస్తా

09-05-2026 12:00 AM

ప్రభుత్వం మెడలు వంచి పరిష్కారం చేపిస్తాం 

 వడ్లు కొనుగోలు చేయాల్సిందే : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ రూరల్ మే 8 : ప్రజా సమస్యలను ఎండగట్టేందుకు పార్టీ నేతలతో చర్చించి పాదయాత్ర చేపడతానని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రాంరెడ్డి గూడెం మిల్లు వద్ద వడ్లు అమ్మకం చేసేందుకు వాహనాల్లో సంచులు పెట్టుకొని ఎదురు చూస్తున్న రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. పాదయాత్ర చేస్తూ ప్రతి రైతును కలుస్తానని, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతు ఎలా అమ్ముకుంటాడని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలను మరచి సర్పంచులను ఇతర నేతలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ వ్యాపారాలు 40 కేజీలకు 3 నుంచి 4 కిలోల తరుగు తీస్తున్నారని, ప్రభుత్వం సరిగ్గా కొనకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.