సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్,ఆగస్టు 17(విజయక్రాంతి): తెలంగాణ సర్పంచుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఆయన ఎన్నికయ్యారు.బషీర్బాగ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిధులపై ఫ్రీజింగ్ను తొలగించి వాటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామ వ్యవస్థ బలోపేతమైతేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యవసాయంపై సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలో అన్ని జిల్లాల జేఏసీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించి గ్రామాల అభివృద్ధి, సమస్యలపై చర్చిస్తామని తెలిపారు.
జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంతో పోరాడి బిల్లులు ఇప్పించేందుకు కృషి చేశామని తెలిపారు. బండారు రామ్మోహన్ రావు సర్పంచులకు గ్రామ అభివృద్ధి, ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాగయ్య, మధుసూదన్ రెడ్డి, మల్లయ్య, వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.






