14 July, 2026 | 3:53 AM

జల్‌పల్లిలో పాదయాత్ర చేస్తా

14-07-2026 01:10 AM
  1. మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి 
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): జల్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన మైనారిటీ ప్రతినిధులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివ రించారు. ఈ సమావేశం సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ దేవల్ల సమ్మయ్య, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ కొట్టే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా జల్పల్లి మున్సిపా లిటీ మైనారిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా ఎంఐఎం పార్టీ అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా అనుకూలంగా వ్య వహరిస్తూ, జల్పల్లి మున్సిపాలిటీలోని మై నారిటీల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుని, అభివృద్ధికి దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జల్పల్లి మున్సిపాలిటీలో స్వయంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని మల్లన్నను కో రారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. 1951 నుంచి ఇప్పటి వరకు ఒక్క ముస్లిం మహిళ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదని, ఈ చారిత్రక లోటును తెలంగాణ రాజ్యాధికార పార్టీ భర్తీ చేస్తుందని తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తొలి ముస్లిం మహిళకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జల్పల్లి మున్సిపాలిటీలో త్వరలోనే పాదయాత్ర నిర్వహించి ప్రతి కాలనీ, ప్రతి వాడలో ప్రజ ల సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని తెలిపారు.

క్షేత్రస్థాయిలో సమస్యలను అధ్యయనం చేసి, రాబోయే ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనారిటీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాడుతుందని పే ర్కొన్నారు. సమావేశం అనంతరం జల్పల్లి మైనారిటీ ప్రతినిధులు మల్లన్నకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, త్వరలోనే భారీ స మావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

కార్యక్రమం లో జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మహమ్మద్ ఘౌస్, మొహమ్మద్ మజ్హర్ అలీ, షకీర్ భాయ్, హమద్ భాయ్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ సాజిద్, అబ్దుల్ ఖయ్యూం, మొహమ్మద్ రఫీక్, మొహమ్మద్ హాజీ, మొహమ్మద్ ముస్తఫా ఖాన్, అఫ్సర్, ఖాజా పాషా, నియాజ్, హసన్ అలీ, ఖాజా భాయ్, వహీద్ భాయ్, నసీమ్ భాయ్, పర్వీ జ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.