25-01-2026 01:15:13 AM
కానీ.. సీఎం, ఆయన బామ్మర్దిపై విచారణ జరిపిస్తానని హామీ ఇవ్వండి
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ‘భట్టి గారూ.. మీరంటే నాకు చా లా గౌరవం. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశంతోనే లేఖ రాశాను. మీరు నిజంగా సీఎం రేవంత్, ఆయన బామ్మర్ది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాను అని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్దం’అని మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడిం చారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్ మీట్‌పై హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విక్రమార్క విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజమని, అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్‌గా పాత్ర పోషించింది నిజమని స్పష్టం చేశారు.
ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారని, సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా నేటి ప్రెస్‌మీట్‌లో మాట్లాడలేదని సూటిగా అడిగారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను బీఆర్‌ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్ధాలు అయిపోవని, జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవని పేర్కొన్నారు.
సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని , దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా పేర్కొంటూ ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్టు అని నిలదీశారు. ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేశామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా అని నిలదీశారు.