25-01-2026 01:00:25 AM
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి) : సింగరేణి ఆధ్వర్యంలోని నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ రగడపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నియమించిన సాంకేతిక కమిటీ విచారణ పూర్తయ్యింది. సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదేశాలతో వాస్తవాలను వెలికితీసేందుకు ఈనెల 21న ఇద్దరు సభ్యుల తో సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీలో బొ గ్గు మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లును సభ్యులుగా నియమించారు.
ఈ సమాచారం గురువారం ఉదయం సింగరేణి సీఎండీకి చేరగా.. మధ్యాహ్నానికల్లా ఈ కమి టీ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. గురు, శుక్ర వారాల్లో కమిటీ సభ్యులు పలు రికార్డులు, ఫైళ్లను పరిశీలించారు. కమిటీ సైట్ విజిట్ అంశంతోపాటు.. సీఎస్‌ఆర్ నిధుల ఖర్చులపై లోతుగా సమాచారాన్ని సేకరించింది. ఆయా అంశాలవారీగా వచ్చే అను మానాలను సింగరేణి అధికారుల నుంచి నివృత్తి చేసుకుంది. అలాగే ఏరియాల వారీ గా సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల పనులు, చేపట్టిన స్థలాల వారీ గా సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.
అవసరమైతే శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మరింత సమాచారం తీసుకోవాలనే ఆలోచనలో కమిటీ సభ్యులు ఉన్నట్టు శుక్రవారం సాయంత్రానికి చర్చ జరిగింది. అయితే శుక్రవారం రాత్రికల్లా పూర్తి సమాచారం హైదరాబాద్‌లోనే అందుకోవడం, పైగా శనివారం కేంద్ర బొగ్గు మంత్రి జి.కిషన్‌రెడ్డి కొత్తగూడెం పర్యటన ఉండటంతో.. హైదరాబాద్‌లో విచారణను ముగించుకుని శుక్రవారం రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్టు సమాచారం.
నివేదిక రూపొందించే పనిలో కమిటీ
ఢిల్లీకి చేరిన కమిటీ శనివారం నివేదికను తయారుచేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ లో పూర్తి సమాచారాన్ని సేకరించిన తరువాత.. ఇక ఇక్కడ ఉండటం అవసరం లేదని భావించిన కమిటీ.. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనలతో వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం కమిటీ సభ్యులిద్దరు కలిసి ఒక నివేదికను తయారుచేయడంలో నిమగ్నమయ్యారు. ఈ నివేదిక ఆదివారం బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
కమిటీ నివేదికను పరిశీలించిన తరువాత బొగ్గు మంత్రి త్వ శాఖ ఉన్నతాధికారులు నివేదికను మంత్రి కిషన్‌రెడ్డికి అందించి, సాంకేతికాంశాలను వివరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. మొత్తానికి మూడు రోజుల్లోనే విచారణను ముగించి నివేదిక ఇవ్వాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో.. శనివారం నాటికే నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆదివారం ఉదయానికల్లా తప్పకుండా నివేదిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు చేరుతుందని, మంత్రికి పూర్తిగా వివరించిన తరువాత అందులో పేర్కొన్న అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.