25-01-2026 12:48:34 AM
కాలానుగుణంగా వినోదరంగంలో ప్రత్యామ్నాయ మార్గాలు
ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి. అయినా సినిమాలకు ఆదరణ తగ్గడంలేదు. కాకపోతే, ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. సినీప్రియుల నాడిని పట్టేస్తూ మూవీ మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త కథలను సిద్ధం చేస్తున్నారు. స్టోరీ డిమాండ్ చేస్తే ఎలా మేకోవర్ అయ్యేందుకైనా సై అంటున్నారు కథానాయకులు. మేమేం తక్కువా..? అంటూ అదే బాటను అనుసరిస్తూ హీరోయిన్లు కూడా ‘కథ’నరంగంలోకి దూకేస్తున్నారు! సినిమాలో కథానాయిక పాత్రే కావాల్సిన అవసరంలేదు.. కథలో ప్రాధాన్యమున్న పాత్ర అయితే చాలంటూ స్క్రిప్టులను ఓకే చేస్తున్న అందాల తారలెందరో! మరి అలాంటి విభిన్నమైన కథలేంటి? వాటిలో భాగమవుతున్న భామలెవరు? ఆ సంగతులే ఈ వారం ‘విజయక్రాంతి స్పెషల్...
కూతురు పాత్రలో కనిపించనున్న కృతిశెట్టి
ఫీమేల్ లీడ్ రోల్ అయితేనే చేస్తా అన్నట్టుగా ఉండటం లేదు హీరోయిన్ల తీరు. ఈ తరహా ఆలోచిస్తున్న ముద్దుగుమ్మల్లో కృతిశెట్టి గురించి ముందుగా చెప్పుకోవాలి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు బాబీ కలిసి ఓ సినిమా చేయబోతు న్నారు. కూతురు సెంటిమెంట్ ప్రధానంగా సాగే కథతో వస్తుం దని సమాచారం. కూతురు పాత్ర కోసం కృతి ఎంపిక ఖరారైనట్టు తెలుస్తోంది.
రీమేక్ మూవీలో రాశీఖన్నా..
దక్షిణాదితోపాటు అటు బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడూ అవకాశాలు అందుకుంటోంది అందాల తార రాశీఖన్నా. ఈమె ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. తెలుగులో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిం చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తు న్నాం’. ఇక్కడ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. దీంట్లో భార్య పాత్రను విద్యాబాలన్ పోషిస్తుండగా, ప్రియురాలి పాత్రలో రాశీఖన్నా కనిపించనుందట. తెలుగులో ఐశ్వర్య రాజేశ్ చేసిన పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేయగా, మీనాక్షి చౌదరి నటించిన ప్రియురాలి పాత్ర కోసం రాశీఖన్నాను ఎంపిక చేశారన్నమాట. మొదట మీనాక్షి పేరునే పరిశీలించిన చిత్రబృందం, చివరకు రాశీనే ఓకే చేసినట్టు టాక్.
‘ఎల్లమ్మ’లో కీర్తి సురేశ్ దేవత పాత్ర..
వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ఈ సినిమాతో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. ఇటీవల దేవిశ్రీ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ ‘పర్శి’ అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఇందులో రెగ్యులర్ హీరోయిన్ ఏమీ ఉండదని, కథ మొత్తం అమ్మవారి పాత్ర చుట్తూ తిరుగుతుందని సమాచారం. అయితే, ఈ ఎల్లమ్మ దేవత పాత్ర కోసం మేకర్స్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. కీర్తి సురేశ్ దేవతగా, ఆమె భక్తుడిగా దేవిశ్రీప్రసాద్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేశ్ ఓకే చెప్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలతో అధికారిక ప్రకటన రానుంది.
‘జననాయగన్’లో దత్తపుత్రికగా మమిత బైజు
‘డ్రాగన్’, ‘డ్యూడ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన యువ తమిళ సోయగం మమిత బైజు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ఈ సినిమాల్లో మమిత అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే, ఈ భామ తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇందులో పూజ హెగ్డేతోపాటు మమిత బైజు నటిస్తోంది. మమిత ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా ఆయనకు దత్త పుత్రికగా కనిపిస్తుందని, ఆమె పాత్ర పేరు వీజీ శ్రీకాంత్ అని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమాలో నటుడు, గాయకుడు టీజే అరుణాచలంతో మమితకు లవ్‌ట్రాక్ ఉంటుందట.
‘యుఫోరియా’లో తల్లిగా భూమిక
వయసు నలభై దాటిన హీరోయిన్లు గతంలో అక్క, చెల్లి వంటి సహాయ పాత్రలను ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు నలభైల్లో ఉన్న నటీమణులు కూడా తల్లి పాత్రలను పోషించేందుకు కూడా ముందుకు వస్తుండటం గొప్ప విషయం. ఈ కోవలో ఇటీవల నటి శ్రియా శరణ్, భూమిక చేరారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘మిరాయ్’ చిత్రంలో నటి శ్రియా తల్లి పాత్రలో కనిపించింది. ఇక తన నడుము అందాల విందుతో యువతను ‘ఖుషి’ చేసిన భూమిక అప్పుడే తల్లి పాత్రలోకి మారనుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజాచి త్రం ‘యుఫోరియా’లో ఆమె యంగ్ మదర్ రోల్‌లో కనిపించనుంది.
విభిన్న పంథాలో యంగ్ బ్యూటీలు..
గతంలో యువ కథానాయకి మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో ఓ బిడ్డకు తల్లిగా కనిపించింది. అంతకుముందు ‘గుంటూరు మిర్చి’లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో మెరిసింది. ఇవేవీ మీనాక్షి కెరీర్‌పై ప్రభావం చూపలేదు. ఇటీవల ప్రభాస్ ‘రాజాసాబ్’లోనూ ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ అలరించారు. ఇక బాలీవుడ్‌లో ఇటీవల సంచలనంగా మారిన ‘ధురంధర్’ చిత్రంలో నటించటం ద్వారా సారా అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది.
నటనతో మెప్పించిందని కొందరు అంటుంటే, వయసులో బాగా వ్యత్యాసం ఉన్న వ్యక్తి సరసన నటించాల్సిన అవసరం ఏంటని మరికొందరు మాట్లాడుకున్నారు. ఈ చర్చలన్నీ ఆమె కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లేందుకే దోహదపడుతున్నాయే తప్ప ఏమాత్రం ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టివేసినట్టు లేదు. ఏదేమైనా ఇలా బ్యూటీలు పోటాపోటీగా చేసిన, చేస్తున్న, చేయనున్న సినిమాలు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.