calender_icon.png 25 January, 2026 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చిపోయిన గంజాయి ముఠా

25-01-2026 01:07:16 AM

  1. కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన స్మగ్లర్లు 
  2. తీవ్రంగా గాయపడిన సౌమ్య 
  3.  పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
  4. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు 
  5. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
  6. కార్యాలయం ఎదుట ఎక్సైజ్ సిబ్బంది ఆందోళన 
  7. విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని డిమాండ్

నిజామాబాద్ జనవరి 24(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. కారులో పారిపోతున్న స్మగ్లర్లను అడ్డుకునే ప్రయత్నంలో.. కారును ఆపాలంటూ వెళ్లిన ఎక్సై జ్ మహిళా కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన కా నిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విధి నిర్వహణలో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎక్సై జ్ సిబ్బంది నిజామామాద్‌లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

శుక్రవారం రాత్రి మాధవ్ నగర్ వద్ద ఓ కారు లో నిర్మల్ జిల్లా నుంచి గంజాయి తరలిస్తున్న సమాచారం రావడంతో వారిని పట్టుకునేందుకు ఎక్సెజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న సిబ్బందితో కలిసి వెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకోగా కారులో గంజాయి తరలి స్తున్న స్మగ్లర్ల కారు రాగా.. కారును ఆపాలని కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించారు. స్మగ్లర్లు కారును ఆపకుండా సౌమ్యను ఢీ కొట్టారు. దీంతో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

చావు బతుకుల మ ధ్య ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొం దుతోంది. కాగా, ఘటన జరిగిన వెంటనే ఎస్ హెచ్‌వో స్వప్న తక్షణమే స్పందించి సౌమ్యకు సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడినట్టు తెలుస్తోంది. కాగా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా, స్థానిక పోలీసుల సహకారం లేకుండా గంజా యి ముఠాను అడ్డుకోవడానికి కానిస్టేబుల్ సౌమ్యను ఎలా పంపారు అనే ప్రశ్న తలెత్తుతోంది. గంజాయి ముఠా ఘాతుకంలో గాయపడ్డ సౌమ్య ప్రాణానికి ఎవరు బాధ్యులని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా ప్రాణాలతో చెలగాటం

గంజాయి స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లే సమయంలో ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, పోలీసుల సహాయం లేకుండా, ఆయుధాలు లేకుండా అధికారులు తమను తీసుకువెళ్లి తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎక్సెజ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎక్సెజ్ కిందిస్థాయి సిబ్బంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. స్మగ్లర్లను పట్టుకునే టాస్క్ వల్ల కిందిస్థాయి సిబ్బంది ప్రాణాలపైకి వస్తోందని తగిన రక్షణ కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆందోళన దిగారు.

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే సమయం లో తమ ప్రాణాలకు తెగించి స్మగ్లర్లతో తలపడుతున్నామని, ఈ సందర్భంలో తమ ప్రా ణాల కు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ సౌమ్యకు మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకో వాలని, ఆమె కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సుమారు రెండు గంటల పాటు సిబ్బంది. కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి సిబ్బంది వద్దకు వెళ్లి కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి నచ్చజెప్పడంతో సిబ్బంది ఆందోళన విరమించారు. 

సౌమ్యకు కలెక్టర్ పరామర్శ 

నిజామామాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. సౌమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీస్ కమిషనర్‌ను కోరతామని అన్నారు.

సౌమ్య వెంటిలేటర్ పై ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారని కలెక్టర్ వెల్లడించారు. సౌమ్య ఆరోగ్యం సహకరించిన వెంటనే ఉన్నత స్థాయి వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేలా ఏర్పాట్లు చేశామని, ఆమె వైద్యం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

కాగా, ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ విధి నిర్వహణ సమయంలో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. కలెక్టర్ వెంట ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.