25-01-2026 12:29:06 AM
నారాయణపేట. జనవరి 24 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడి తీరు పలు విమర్శలకు తావిచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన సీనియర్ నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు, కౌన్సిలర్ అభ్యర్థులకు పెద్ద పీట వేస్తున్నట్లు పార్టీలోని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్బే ప్రధానంగా సీట్ల కేటాయింపు ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ కోసం కస్టపడి ఎమ్మెల్యేను గెలిపించుకొంటే తమ కు ఇచ్చే బహుమతి ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని అభ్యర్థిని చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించటం కొంతమంది నేతలు జీర్ణించుకోలేక, బయటకు చెప్పుకోలేక బహిరంగ విమర్శలు సైతం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నాలుగు కోట్ల రూపాయలు కౌన్సిలర్ల అభ్యర్థుల కోసం ఖర్చుపెట్టి గెలిపించుకోవాలని వ్యాపారవేత్తకు సదరు నాయకుడు సూచించినట్లు తెలుస్తున్నది.
దీంట్లో భాగంగానే సదరు వ్యాపారవేత్త ఖర్చుకు వెనక్కి తగ్గకుండా గెలుపు కోసం కోట్ల రూపాయలు పెట్టుకొంటాడని, దీంట్లో భాగంగానే ఆయనకు సంబంధించిన నమ్మకస్తులయిన వ్యక్తులను కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే సదరు వ్యాపారవేత్త నిర్ణయాన్ని సైతం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేక తప్పు పట్టడమే కాకుండా ఇన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉంటే మాకు ఇచ్చే బహుమతి ఇదేనా? అంటూ కొంతమంది యువ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చైర్ పర్సన్‌గా పోటీ చేసే అభ్యర్థి భర్త కూడా గతంలో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. అయిదేళ్లలో ఆయన ప్రాతినిధ్యం వహించిన వార్డును అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని, కనీసం ప్రజల సమస్యలు చెప్పుకోవటానికి వస్తే సమయం ఇవ్వని నేత అంటూ ఆ వార్డు ప్రజలు విమర్శలు సైతం చేస్తున్నారు. ఆయన ఒక ప్రముఖ బులియన్ మర్చంట్‌లో ఆరితేరిన నాయకుడు, కానీ రాజకీయాల్లో సైతం డబ్బులు వెదజల్లి పదవులు తెచ్చుకోవటం అలవాటుగా మారిందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.