నాకు ఆ ట్యాగ్ రావాలని కోరుకున్నా!
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజాచిత్రం ‘డెకాయిట్’. శానిల్ డియో దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, ఏప్రిల్ 10న విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తమ సినిమా విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోందని పేర్కొంటూ మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “డెకాయిట్’ బెంగళూరు సెలబ్రేషన్స్‌లో తమిళనాడుకు చెందిన ఒక లాయర్ కలిసి తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాడు.
తనను ఎవరో 150 మంది కలిసి కొట్టారట. చాలాకాలం హాస్పిటల్లో ఉన్నాడు. బయటకు రావాలంటే భయమేసిందని, తనకు ధైర్యం ఇచ్చింది ‘మేజర్’ సినిమా అని చెప్పాడు. ‘డెకాయిట్’ రిలీజ్ అవుతుందని తెలుసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మొదటిగా ఈ సినిమానే చూశానని చెప్పాడు. చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమైంది.. మనం సినిమా, బిజినెస్ గురించి ఆలోచిస్తూ మానవత్వాన్ని ఎక్కడో మర్చిపోతాం.
ఆయన నాకు ఆ మానవత్వాన్ని మళ్లీ గుర్తు చేశాడు. నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో గుర్తు చేశాడు. అలాగే ‘మేజర్ సందీప్’ ఫ్యాన్ పేజ్ నిర్వహిస్తున్న వారు ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో పెట్టుకోమని నాకు ఇండియన్ ఫ్లాగ్ ఇచ్చారు. ఇంత ప్రేమను ప్రేక్షకుల నుంచి పొందుతున్నప్పుడు.. ఇదే క్రెడిబిలిటీ అనిపిస్తుంది. హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. అందుకే నాకు ‘గుడ్ సినిమా’ శేష్ అనే ట్యాగ్ రావాలని కోరుకున్నా. అలాంటి సంతృప్తి ఈ సినిమా ఇచ్చింది.
బెంగళూరులో ఆ లాయర్‌ను కలిసినప్పుడు వచ్చిన అనుభూతి నాకు ఒక షీల్డ్‌లా అనిపించింది” అన్నారు. డైరెక్టర్ శానిల్ డియో మాట్లాడుతూ.. “మంచి సినిమాకు ప్రేక్షకులు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. ప్రేక్షకుల ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను” అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, రైటర్ అబ్బూరి రవి, లిరిసిస్ట్ భాస్కరభట్ల, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.






