15-12-2024 01:51:19 AM
నూతన ట్రస్టీగా తెలంగాణబిడ్డ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఐఏఎంసీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం (ఐఏఎంసీ) వ్యవస్థాపక ట్రస్టీ పదవికి జస్టిస్ లావు నాగేశ్వరరావు రాజీనామా చేశారు.
నూతన శాశ్వత ట్రస్టీగా సుప్రీంకోర్టు మరో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2019లో ఐఏఎంసీ ఏర్పాటైనప్పుడు శాశ్వత ట్రస్టీగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, ట్రస్టీలుగా జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లితో ఏర్పాటైంది.
వ్యక్తిగత కారణాల వల్ల జస్టిస్ లావు నాగేశ్వరరావు రాజీనామా చేసినట్టు చెప్తున్నప్పటికీ ఐఏఎంసీ మార్గదర్శకాల్లో ట్రస్టీలు కొనసాగే వాళ్లు మధ్యవర్తిత్వం లేదా ఆర్బిట్రేషన్లకు చెందిన కేసుల్ని పరిష్కరించేందుకు వీల్లేదనే నిబంధనే అవరోధంగా మారిందని మరికొందరు పేర్కొన్నారు. ఈ నిబంధన కారణంగా జస్టిస్ లావు నాగేశ్వరరావుకు ఐఏఎంసీకి వచ్చే కేసుల పరిష్కారం చేయడానికి వీల్లేకుండాపోయింది.
తెర వెనుక కుయుక్తులు
దీనికితోడు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన కొందరు పెద్దలు హైదరాబాద్ ఐఏఎంసీ పట్ల సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో కూడా ఇక్కడికి ఆశించిన స్థాయిలో కేసులు రాజీ చేసుకునేందుకు రాలేదని చెప్తున్నారు. ఆర్బిట్రేషన్ అంటే ఢిల్లీ, ముంబై మాత్రమే అనే వైఖరిలో ఆయా లాబీలు చేసే కుయుక్తుల కారణంగా మన ఐఏఎంసీ పురోగమన అడుగులు వేయలేకపోయింది.
అంతర్జాతీయ వేదికల ద్వారా హైదరాబాద్ ఐఏఎంసీలో ఉన్న అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక వసతులు, హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతుల గురించి ప్రాచుర్యం తెచ్చేందుకు చేసిన ప్రయత్నాల్లో కూడా జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పందించకపోవడానికి కారణమని చెప్తున్నారు.
భార్యభర్తల తగవులు కూడా..
ప్యారిస్, సింగపూర్, దుబాయ్ లాంటి చోట్ల అంతర్జాతీయ మీడియేషన్ ఆర్బిట్రేషన్ సెంటర్లకు ఉన్న ఆదరణ తరహాలో హైదరాబాద్‌లో ఐఏఎంసీని కూడా తేవాల్సిన బాధ్యత నూతన ట్రస్టీపై ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ ఐఏఎంసీలో అంతర్జాతీయ సంస్థలు, అదే స్థాయిలోని పరిశ్రమలు, వాణ్యిజ్య సంస్థలే తమ కేసుల్ని సత్వరమే పరిష్కరించుకునే అవకాశం ఉందనే అపోహను తొలగించే అంశంపై ట్రస్టీలు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని మధ్యవర్తిత్వ న్యాయ నిపుణులు కూడా చెప్తోన్నారు. భార్యభర్తల తగవుల నుంచి సివిల్ కేసులు, ఇతర వివాదాలను కూడా పరిష్కరించుకునే వీలుందనే విషయాన్ని సామాన్య ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఢిల్లీ, ముంబై అనే అపోహ తొలగాలి
మన దేశంలో ఆర్బిట్రేషన్‌మీడియేషన్ సెంటర్ అంటే ఢిల్లీ లేదా ముంబై అనే అపోహ నుంచి బయట పడాల్సిన అవసరం చాలా ఉందని న్యాయనిపులు అంటున్నారు. హైదరాబాద్ ఐఏఎంసీని నీరుగార్చే ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాల్సిన బాధ్యత ఐఏఎంసీపై ఉందని చెప్పారు. మీడియేషన్ ఆర్బిట్రేషన్‌పై అతి తక్కువ వ్యయంతో శిక్షణ ఇచ్చే సౌకర్యం మన ఐఏఎంసీలో ఉంది.
కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొందరు వ్యక్తులు ఈ తరహా శిక్షలు ఇచ్చి రూ.౫లక్షల నుంచి రూ.౬ లక్షలు వసూలు చేసేవాళ్లున్నారు. అంతర్జాతీయ అక్రిట్రిడెటెడ్ గుర్తింపు కూడా ఉన్న ఐఏఎంసీలో శిక్షణ పొందితే రూ.50 వేలు మాత్రమే ఖర్చు అవుతుందనే విషయాన్ని ప్రాచుర్యంలోకి తేవాల్సివుంది.
ప్రభుత్వ నిధులతో గుజరాత్లో ఏర్పాటు
హైదరాబాద్ ఐఏఎంసీని నీరుగార్చాలనే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోదీ చేశారనే విమర్శలు కూడా లేకపోలేదు. గుజరాత్‌లో అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వం ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వమే బడ్జెట్లో నిధులను కేటాయించింది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా హైదరాబాద్ ఐఏఎంసీని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయనే విమర్శలు కూడా వచ్చా యి. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ ఐఏఎంసీ పురోగతికి నూతన ట్రస్టీ జస్టిస్ సుదర్మన్‌రెడ్డి ప్రత్యేక చొరవ, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో లక్ష్యం దిశగా
ఐదేళ్ల కాలంలోనే ఐఏఎంసీకి శాశ్వత ట్రస్టీగా తెలంగాణ బిడ్డ, జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి పగ్గాలు అందిపుచ్చుకోవడంతో లక్ష్యం దిశగా ఐఏఎంసీ పయనిస్తుందని పలువురు భావిస్తున్నారు. మధ్యవర్తిత్వం అనే పాశుపతాస్త్రం ప్రజల చేతుల్లోకి చేరాలనే సంకల్పం తో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా హైదరాబాద్లో ఐఏఎంసీని ఏర్పాటు చేయాలని 2019లో సంకల్పించారు. జస్టిస్ ఎన్వీ రమణ ఆలోచనకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో సంపూర్ణ సహకారాలను అందిస్తోంది.
పీవీ పీఎం అయ్యాకే చట్టం
పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యాక చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభించేప్పుడు అంతర్జాతీయ వేదికలపై న్యాయ పరమైన కేసులు ఏళ్ల తరబడి పరిష్కారం అవ్వ డం లేదనే అంశం తెరపైకి వచ్చిందని, అప్పటి కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి పీసీ రావును ప్రధాని ఆదేశించిన ఫలితంగానే 1996లో ఆర్బిట్రేషన్ యాక్ట్ వచ్చింది.
పీసీ రావు చట్ట రూపకల్పనకు ముందు దేశంలోని పలు ప్రదేశాల్లో పర్యటిం చి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసిన వారిలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. ఏపీలోని అనకాపల్లిలో బెల్లం వ్యాపారులకు రైతులకు మధ్య ఏదైనా వివాదం తలెత్తితే..
వాటిని అక్కడి ఇరుపక్షాల పెద్ద లే రాజీ ద్వారా పరిష్కరించుకునే సం ప్రదాయం ఇప్పటికీ ఉంది. బెల్లం వ్యాపార లావాదేవీలపై కోర్టులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే మధ్యవర్తిత్వం ఎంత బలంగా ఉందో ఆనాడు అధ్యయనంలో గుర్తించారు.