26-07-2025 12:07:28 AM
- ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ రివిజన్ పిటిషన్
- కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం
హైదరాబాద్, జూలై 25: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఎదు రుదెబ్బ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె ఉన్నత న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ఓఎంసీ కేసు లో శ్రీలక్ష్మిని న్యాయస్థానం ఇదివరకే నిందితురాలిగా నిర్దారించింది.
కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ జరపనుంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను 2022, అక్టోబర్‌లో సీబీఐ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. శ్రీలక్ష్మి పిటిషన్‌ను అనుమతించింది. ఆమె ను కేసు నుంచి తప్పిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ సుప్రీకోర్టును ఆశ్రయించింది.
విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. సీబీఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీచేయడం సరికాదని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకొని కొత్తగా విచారణ చేపట్టాలంటూ పిటిషన్‌ను తిరిగి హైకోర్టుకు పంపింది. దీన్ని మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది. 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఓఎంసీ మైనింగ్ లీజు వ్యవహారం ముందుకు సాగిందని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు.
ఈ కేసులో ఆరో నిందితురాలైన శ్రీలక్ష్మి.. వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఓఎంసీకి లీజుల మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయని, కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. సీబీఐ వాదనలు విన్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను తోసిపుచ్చింది.