26-07-2025 12:08:07 AM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల సంభవించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ప్రవాహ సమయంలో కాలువలు, చెరువులు వంటి జల వనరుల వద్దకి వెళ్లకూడదని, వాటిని దాటేందుకు ప్రయత్నించ రాదని స్పష్టం చేశారు.
అలాగే రహదారులు, కాల్వట్ల పై నీరు ప్రవహిస్తున్న చోట్ల అధిక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితమయ్యే అవకాశాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని నీటి సరఫరా అధికారులను సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తాగునీటి సరఫరా లో అంతరాయం రాకుండా సరఫరా విభాగం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిన సందర్భాలలో ఆసుపత్రిలో అత్యవసర సేవలకు ఆటంకం కలవకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ పర్యవేక్షణలో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.