30-07-2025 11:58:28 PM
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు రావాలని ఆ పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏక్ పోలీస్ విధాన హామీని నెరవేర్చలేదని, స్పెషల్ పోలీసులు ప్రభుత్వ ఆస్తులు కాపాడుతూ, శాంతి భద్రతలు రక్షిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. గతంలో నిరసన తెలిపిన స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు బుధవారం తెలంగాణ భవన్‌లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కలిశాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో15 రోజుల విధి నిర్వహణ తర్వాత 4 రోజుల సెలవుకు అనుమతి ఉండేదని, అంటే నెలకు 8 రోజుల సెలవుకు అనుమతి ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకు 4 రోజుల సెలవుకు తగ్గించిందని, దీనికి నిరసనగా స్పెషల్ పోలీసు ఉద్యోగుల కుటుంబసభ్యులు ధర్నా చేయగా, ఆ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, క్రమశిక్షణ గల యూనిఫాం శాఖలో ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్నారు. వారిపట్లా మానవతా దృక్పథంతో ఆలోచించాలని ప్రవీణ్ కుమార్ కోరారు.