06-08-2025 12:02:08 AM
- రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఆలోచన...
- హాట్ స్పాట్‌ల వద్ద పోలీస్ వాహనం, కానిస్టేబుల్ కటౌట్ ఏర్పాటు...
ఆదిలాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): వాహనదారుల వేగానికి కళ్లెం వేసేలా జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని జాతీయ రహదారిపై వాహన వేగానికి నియంతృస్తూ, ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం నూతన ఆలోచనను ఆచరణలో పెట్టింది.
జాతీయ రహదారి - 44 పై అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 2 హాట్ స్పాట్ (ప్రమాద స్థలాలను) గుర్తించి అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేకంగా డయల్ 100 వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ ల కటౌట్ లను ఏర్పాటు చేసి ప్రజలు వాహనదారులు వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా కృషి చేస్తున్నారు. జిల్లాలో ప్రమాదాల ద్వారా ప్రాణ నష్టం పూర్తిగా నిర్మూలించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మేకల గండి, నేరడిగొండ మండలం ఎక్స్ రోడ్డు వద్ద రెండు చోట్ల పోలీసు వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై నిలబడి ఉన్నట్లు కనిపించే విధంగా కటౌట్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనం, పోలీసులు ఉంటేనే వాహనదారులు ప్రజలు సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలకు గురికాకుండా ఉంటారనే ఆలోచనతో ఈ ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. వాహనదారులకు స్వీయ వేగ నియంత్రణ లేకపోవడం ద్వారా గత రెండు సంవత్సరాలలో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రదేశాలను గుర్తించి ప్రాణనష్టాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా కటౌట్లను చేయించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాహనదారులు పోలీసులను చూసి బ్రేకులు వేస్తూ వేగ నియంత్రణ చేస్తూ హెల్మెట్ ధరిస్తూ ఉండటం జరుగుతుందన్నారు. ప్రజల రక్షణకై జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న రీతిలో సేవలందిస్తూ తమదైన శైలిలో జిల్లా ప్రజలకు చేరువవుతున్నదని తెలిపారు.