07-01-2026 03:56:15 PM
- గోల్డెన్ అవర్లో చికిత్సతో తిరిగి నూతన జీవితం ప్రారంభించవచ్చు
హనుమకొండ,(విజయక్రాంతి): మెదడు సంబంధిత పక్షవాతం (స్ట్రోక్) అత్యంత ప్రమాదకరమైన వైద్య అత్యవసర పరిస్థితి అని, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం లేదా శాశ్వత అంగవైకల్యం కలగవచ్చని వరంగల్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడటంతో పాటు పూర్తి ఆరోగ్యానికి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. స్ట్రోక్ బాధితులకు వేగవంతమైన మరియు సమగ్ర వైద్యం అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్‌లో 24 గంటల అత్యవసర విభాగం, ప్రత్యేక న్యూరాలజీ బృందం, అధునాతన డయాగ్నస్టిక్ సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
డా. ప్రియాంక, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మాట్లాడుతూ స్ట్రోక్ చికిత్సలో మెదడుకు రక్తప్రసరణ నిలిచిన ప్రతి నిమిషం లక్షలాది మెదడు కణాలు నశిస్తాయి. అందుకే లక్షణాలు ప్రారంభమైన తొలి 4.5 గంటల అనగా గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేర్చడం అత్యవసరం. మెడికవర్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక థ్రోంబోలిసిస్ చికిత్స ద్వారా రక్తపు గడ్డలను కరిగించి, శాశ్వత అంగవైకల్యం రాకుండా రోగిని రక్షించగలుగుతున్నాం అని తెలిపారు. డా.దినేష్, కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్ మాట్లాడుతూ “అకస్మాత్తుగా ముఖం ఒకవైపు వంగిపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ విభాగానికి రావాలి.
మెడికవర్ హాస్పిటల్స్‌లో సి టి, ఎమ్మారై స్కానింగ్ సదుపాయాలు, ప్రత్యేక స్ట్రోక్ ఐసీయూ ఉండటం వల్ల వేగవంతమైన నిర్ధారణతో తక్షణ చికిత్స అందించడం సాధ్యమవుతోందని తెలిపారు. అనంతరం ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం వల్ల రక్తపోటు, మధుమేహం (షుగర్) నియంత్రణలో ఉంచుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడంవల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని అన్నారు.