03-08-2025 12:03:48 AM
అందమైన చీరలను మెచ్చని మగువలు ఉండరు. అందులోనే ఇక్కత్ చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. నల్లగొండ జిల్లా పోచంపల్లి చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. భారతదేశంలోనే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పోచంపల్లి ప్రసిద్ధి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన చీరలు అందర్ని మురిపిస్తాయి.
మగువల మనసు దోచేలా చీరలు నేయడం ఇక్కడి నేతన్నల పనితనానికి నిదర్శనం. సాధారణ స్త్రీల నుంచి దేశ విదేశీయ వనితల వరకు అందర్నీ ఆకట్టుకొనే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని పోచంపల్లి పొందింది. ఆనాడు అగ్గిపెట్టెలో పట్టేలా పట్టు చీరలు నేసిన నేతన్నలు ప్రస్తుతం అనేక డిజైన్లలో చేనేత బట్టలను నేసి అందర్నీ ఆకర్షిస్తున్నారు. పోచంపల్లిలో మొదటగా నూలు చీరలను మాత్రమే నేసేవారు.
క్రమంగా పట్టుతో నేస్తున్నారు. ఈ చీరల తయారీ ఇక్కత్ మీద ఆధారపడి ఉంటుంది. పోచంపల్లి వార్ఫ్ ఇక్కత్‌తో మొదలుపెట్టి డబుల్ ఇక్కత్ మీద పనిచేయడం మొదలుపెట్టారు. నూలుతో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో అది పట్టు మీద కూడా చేపట్టారు. గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో లాగా తెలంగాణలో ఇక్కత్‌కు పోచంపల్లి ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి నేతల్లో ఉండే ప్రత్యేకత వార్పు, ఇంకా వెఫ్ట్ మీదకు పోచంపల్లి డిజైన్ దింపుతారు.
నేయబోయే బట్ట డిజైన్ రంగు, అద్దిన దారాల్లో కనిపిస్తుంది. చిక్కులుగా ఉన్న పట్టు దారాల నుంచి ఒక్కో పోగును తీసుకొని రత్నంపై వడుకుతారు. వడికిన పట్టును మొత్తం కండెలకు చుడతారు. కండల నుంచి దారామంతా ఆసు పోస్తారు.
ఎంపిక చేసుకున్న డిజైన్‌ను ఆసుపై పోస్తారు. చిటికీ ద్వారా డిజైన్ చేస్తూ రబ్బర్‌తో ముళ్లు వేసి కావాల్సిన రంగులు అద్దుతూ అందమైన వస్త్రాలను నేస్తారు. ఇలా నేతన్న నేస్తున్న చీర తయారయ్యేందుకు 5 నుంచి 6 రోజులు పడుతుంది.
పోచంపల్లి, విజయక్రాంతి