04-08-2025 12:00:00 AM
కాజీపేట- డోర్నకల్ రైల్వే సెక్షన్ లో మహబూబాబాద్ జిల్లా లో ఉన్న తాళ్ల పూసపల్లి రైల్వేస్టేషన్ ప్రయాణికులను తికమక పెడుతోంది. స్టేషన్ ఉన్న గ్రామం అన్నారం అయితే తాళ్ల పూసపల్లి పేరు ఉండటమే ఇందుకు కారణం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని అన్నారం గ్రామంలో ఉన్న రైల్వేస్టేషన్‌కు పక్కన ఉన్న గ్రామం తాళ్ల పూసపల్లి పేరును రైల్వే శాఖ ఇప్పటికీ కొనసాగిస్తోంది.
తాల్ల పూసపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు దిగిన ప్రయాణికులు గ్రామంలోకి వెళ్లగానే ఆ ఊరు అన్నారమని .. తాళ్ల పూసపల్లి కి వెళ్లాలంటే మరో రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుందని చెబుతుండటంతో అరే ఇదేమిటి? ఇలా ఒకచోట ఊరు ఉంటే స్టేషన్ పేరు మరోటి పెట్టడమేంటని ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి తరచుగా ఎదురవుతోంది. 50 ఏళ్ల క్రితం ప్రస్తుతం రైల్వేస్టేషన్ ఉన్న అన్నారం గ్రామం తాళ్ల పూసపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో శివారు గ్రామంగా ఉండేది.
30 ఏళ్ల క్రితం ఈ రెండు గ్రామాలు విడిపోయి వేర్వేరుగా రెవెన్యూ గ్రామాలుగా ఏర్పడి ప్రస్తుతం రైల్వేస్టేషన్ ఉన్న ప్రాంతం అన్నారం గ్రామ రెవెన్యూ పరిధిలోకి వచ్చింది. అయితే ఇప్పటికీ రైల్వే శాఖ తాళ్ల పూసపల్లి పేరునే కొనసాగిస్తుండటంతో ప్రయాణికుల తికమకకు కారణంగా మారింది. తాళ్ల పూసపల్లి రైల్వేస్టేషన్ పేరును అన్నారం రైల్వే స్టేషన్‌గా మార్చాలని మూడు దశబ్దాలుగా రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే తరహాలో అలంఖానిపేట రైల్వే స్టేషన్ ఉండేదని, ఇంటికన్నె రెవెన్యూ గ్రామంగా ఏర్పడగానే అలంఖానిపేట పేరు తొలగించి రైల్వేస్టేషన్‌కు ఇంటికన్నెగా మార్చారని, తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు స్పందించి తాళ్ల పూసపల్లి రైల్వేస్టేషన్ పేరు తొలగించి అన్నారం పేరు పెట్టి గజిబిజికి తెరదించాలని కోరుతున్నారు.
బండి సంపత్‌కుమార్, మహబూబాబాద్