calender_icon.png 13 January, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ బరిలో పందెం కోళ్ల వేట.!

13-01-2026 10:33:55 AM

విడుదలైన తుది విడత ఓటరు జాబితా. 

రిజర్వేషన్ల పైనే అందరి ద్రుష్టి.

గెలుపే లక్ష్యంగా నేతల సమాలోచనలు. 

కందనూల్ బిఆర్ఎస్ లో వర్గ పోరు. 

సమానంగా సీట్ల పంపకాలు. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేల అధికార, ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలు, రాజకీయ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. వచ్చేనెల మొదటి వారంలోనే దాదాపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావస్తుందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్ నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలలోని అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆయా పార్టీల ముఖ్య నేతలు తల మునకలవుతున్నారు. ఇప్పటికే తొలి విడత ఓటరు జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ, సవరణ అనంతరం అధికారులు సోమవారం తుది జాబితాను కూడా విడుదల చేశారు. ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధం అవుతున్నారు. మరో పక్కా అభ్యర్థులు కులాల వారిగా, యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఆయా పార్టీల బలాబలాల లెక్కలు వేస్తున్నారు. దాదాపు రిజర్వేషన్లు మారుతున్నాయని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఒక్కో వార్డు పరిధిలో సుమారు ముగ్గురు అంతకంటే ఎక్కువ గెలిచే అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని ఆయా పార్టీల ముఖ్య నేతలు సూచిస్తున్నారు.

గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో  ఆయా పార్టీ మద్దతు దారులు నువ్వా నేనా అనేలా పోటీ పడ్డారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఆయా పార్టీ భీఫామ్ గుర్తుల ఆధారంగా పోటీలు జరగనున్నాయ్. ఈ నేపథ్యంలో ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. సంక్రాతి అనంతరం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న ఈ తరుణంలో పందెంలో గెలవగలిగే పందెం కోళ్లపైనే నేతలు దృష్టి సారించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మూడో సారి, జిల్లాల పునర్విభజన తరువాత రెండో సారి ఎన్నికలు జరగనున్నాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇతర పార్టీ లోని ఆహావహులు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఒకవేళ వలసలు పెరిగితే అధికార పార్టీ ముఖ్య నేతలకు కొత్త తలనొప్పి వచ్చి పడే అవకాశమూ లేకపోలేదు. ఫలితంగా రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.

దీంతోపాటు రిజర్వేషన్ల అంశం కూడా ఖరారు కాకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆయా పార్టీల ముఖ్య నేతలకు తలకు మించిన భారంగా మారింది. ఎన్నికల బరిలోకి గెలిచే అభ్యర్థులను "పందెం కోళ్లనే " ఎంపిక చేసేందుకు ప్రత్యేక అంతర్గత సర్వేలు కూడా చేస్తున్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎలాగైనా పట్టు సాధించాలని బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు అడుగులు వేస్తుండగా తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావడంతో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపల్ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. దాదాపు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అందుకు తగినట్లు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. చైతన్యవంత ప్రాంతంగా పేరొందిన కల్వకుర్తి మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రిజర్వేషన్లు ఎలా వచ్చినా ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను రంగం సిద్ధం చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు కొంత అయోమయంలో ఉన్నారు. రెండు వర్గాలు సమ భాగాలుగా పంచుకొని పోటీలో గెలవాలని పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. అధికార పార్టీలో మాత్రం గతంలో గెలిచిన అభ్యర్థులు ఆర్ధికంగా బలపడినప్పటికీ ఏ ఒక్క అభ్యర్థి మరోసారి గెలిచే అవకాశం లేకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు ఖరారైన వెంటనే వాటికి అనుగుణంగా సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరమైన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తుంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆయా వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న  ఆశావహులు మాత్రం ఓటర్లను ఆకర్శించేందుకు మద్యం, ఆర్థిక వనరులను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తంగా రిజర్వేషన్లు ఖరారైన వెంటనే మున్సిపల్ ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.