13-01-2026 11:43:27 PM
పట్టించుకోని ఉన్నతాధికారులు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): అచ్చంపేట మండల పరిధిలోని అటవీ సమీపంలో ఉన్న ఎర్ర గుట్టలను మట్టి వ్యాపారులు అక్రమంగా తోడేస్తున్నారు. లక్షల విలువైన ఎర్ర మట్టిని గోతులు తవ్వి ప్రయివేట్ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విక్రయిస్తూ మట్టి వ్యాపారాలు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మండల పరిధిలోని రంగాపురం, లక్ష్మాపూర్, చెంచు పలుగు తండా, చౌటపల్లి, బ్రాహ్మణపల్లి, చందాపూర్, అటవీ సమీపంలో గల ఎర్ర మట్టి గుట్టలను అధికార ప్రతిపక్ష పార్టీ ప్రైవేటు వ్యక్తులు తోవ్వుతూ మట్టిని బహిర్గతంగా పట్ట పగలు జెసిబి, టిప్పర్, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ విక్రయిస్తున్నారు.
అధికారులకు ముడుపులు..!
ప్రభుత్వం ప్రైవేటు పట్టా భూముల్లోనూ జెసిబి హిటాచి వంటి భారీ వాహనాలతో మట్టిని తవ్వాలన్న తప్పనిసరి రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారుల అనుమతి చేసుకోవాలి. అందుకు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే వెంటనే సంబంధిత రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు అడ్డుకోవాల్సి ఉంది. కానీ పగలు రాత్రి అని తేడా లేకుండా భారీ వాహనాల సహాయంతో ఎర్రమట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ మైనింగ్ శాఖలతోపాటు పోలీస్ శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల నుంచి భారీగా ఫిర్యాదులు అందినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల ఈ అనుమానాలకు బలం చేకూరుతున్నాయి. అయినా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.