calender_icon.png 19 January, 2026 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్​

19-01-2026 05:33:08 PM

కామరెడ్డి అర్బన్,(విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో  ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బైక్​పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని వెంబడించి పట్టుకుని విచారించగా ఎటువంటి అనుమతి లేని జిలెటిన్​ స్టిక్స్, డిటోనేటర్లు, వైర్లను తరలిస్తున్నట్టుగా గుర్తించారు.

నిజామాబాద్ జిల్లా  నందిపేటకు చెందిన వరికుప్పల నర్సింలు అనే వ్యక్తి నుంచి డిటోనేటర్లు కొనుగోలు చేసి గాంధారి మండలంలోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండరాళ్లను పేల్చేందుకు తీసుకెళ్తున్నట్లుగా విచారణలో తేలింది. దీంతో పేలుడు పదార్థాలు తరలిస్తున్న కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన రాజు, ఛత్తీస్​ఘడ్ రాష్ట్రం మౌలమవ్ పూర్​కు చెందిన చౌకి, పనర్వాణి గ్రామానికి చెందిన శేషులాల్​లను అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలు విక్రయించిన వ్యక్తి వద్ద 5 వేలకు పైగా ఉన్న జిలిటీన్ స్టిక్స్ ఉన్న మ్యాగ్జిన్ లభించిందని, వాటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తుల వద్ద 50 జిలెటిన్​ స్టిక్స్, 6 డిటోనేటర్లు, 52 మీటర్ల వైరు, ఒక బైక్, మొబైల్, స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే విక్రయించిన వ్యక్తి నర్సింలు వద్ద 20 జిలెటిన్​ స్టిక్స్, 4 డిటోనేటర్లు, 5 మీటర్ల వైర్​, లాగ్ బుక్స్, మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో పేలుడు పదార్థాల లైసెన్స్ ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఒరుసు సాయి మల్లు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. తప్పించుకుని పారిపోతున్న వ్యక్తులను పట్టుకున్న హోంగార్డును ఎస్పీ అభినందించారు.