calender_icon.png 16 September, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

16-09-2025 12:00:00 AM

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్

గచ్చిబౌలి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): మహిళల భద్రత, హక్కుల పరిరక్షణలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజుందార్ పిలుపునిచ్చారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఆడిటోరియంలో జరిగిన మహిళా జన సునవాయి కార్యక్రమంలో ఆమె పాల్గొని, బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మహిళలకు వ్యతిరేకంగా జరిగే హింసాత్మక చర్యలను నిర్లక్ష్యం చేయకుండా, పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మహిళలు మొత్తం 56 వినతులను సమర్పించగా, వాటిని పరిశీలిస్తూ డాక్టర్ అర్చన మజుందార్ సంబంధిత పోలీసు అధికారులను ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గృహహింస, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలపై తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు. బాధితులకు భరణం అందేలా, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

బాధితుల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ద్వారానే సమాజంలో నమ్మకం పెరుగుతుందని అర్చన మజుందార్ పేర్కొంటూ, మహిళలకు అండగా నిలవడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీలత, డిఎస్స్పిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తమ సమస్యలు పట్టించుకుని విన్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.