16-09-2025 01:19:49 AM
పెండింగ్ బకాయిలు 1,400 కోట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి 360కి పైగా చిన్న, మధ్య తరహా ఆసుపత్రుల్లో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి రూ.1,400 కోట్లు బకాయిలు విడుదల కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం తెలంగాణ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది.
బకాయిలు విడుదల చేయాలని మూడువారాలుగా సంఘం అనేకసార్లు ప్రభుత్వ పెద్దలు, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఏహెచ్‌సీటీ సీఈవోతోనూ చర్చలు జరిపామని, అయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వాపోయింది.
బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో సమర్థంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ సేవలు అందించలేకపోతున్నామని, ఆర్థికపరమైన ఇబ్బందులే అందుకు కారణమని స్పష్టం చేసింది. రోగులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నా మని, ఆసుపత్రి యాజమాన్యాల సమస్యల ను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.